రూ.5.5 కోట్ల కారులో అసెంబ్లీకి ఎమ్మెల్యే!

6 Apr, 2017 16:21 IST|Sakshi
రూ.5.5 కోట్ల కారులో అసెంబ్లీకి ఎమ్మెల్యే!

ముంబై: మహారాష్ట్రలో అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యంత ఖరీదైన కారులో శాసనసభకు రావడం చర్చనీయాంశంగా మారింది. థానె జిల్లా మీరా-భయందర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మోహతా గురువారం ల్యామ్బోర్గిని కారులో అసెంబ్లీకి వచ్చారు. తన భార్యకు పుట్టినరోజు కానుకగా ఇచ్చిన ఈ లగ్జరీ కారులో ఆయన అసెంబ్లీ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా కెమెరాలు కాసుక్కూర్చోవడంతో శాసనసభ ప్రాంగణంలో ఆయన ఎక్కువసేపు గడపకుండా వెళ్లిపోయారు.

గతేడాది ఆగస్టులో ఈ కారు నడుపుతూ నరేంద్ర మోహతా భార్య సుమన్ యాక్సిడెంట్ చేయడంతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. భర్తతో కలిసి కారులో ట్రయల్ రన్కు వెళ్లిన సుమన్ ఆపివున్న ఆటోను ఢీకొట్టారు. ఆటో దెబ్బతిన్నా, డ్రైవర్ సహా ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆటో రిపేర్ చేయించుకునేందుకు ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చారు. దీంతో పోలీసు కేసు నమోదు కాలేదు.

మరిన్ని వార్తలు