శ్రీ‘రంగం’లో బీజేపీ

24 Jan, 2015 03:58 IST|Sakshi
శ్రీ‘రంగం’లో బీజేపీ

చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత శ్రీరంగం ఉప ఎన్నికపై ఉత్సాహంతో ఉన్న బీజేపీకి కూటమి నేతలతో మింగుడు పడలేదు. ఎండీఎంకే దూరం కావడం, ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని పీఎంకే ప్రకటించడంతో ఇక మిగిలిన డీఎండీకే చుట్టూ ప్రదక్షిణలు చేయకతప్పలేదు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండగా, కూటమి నేతల వైఖరివల్ల బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేక పోయింది.

పోటీ ఖాయం అయితే బీజేపీ అభ్యర్థా లేక కూటమి అభ్యర్థా అనేది ఇంకా నిర్ణయం జరగలేదని బీజేపీ దాటవేస్తూ వచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఈనెల 21వ తేదీన తమిళిసై, 22వ తేదీన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కలిశారు. విజయకాంత్ వారికి ఏమి హామీ ఇచ్చారో గోప్యంగా ఉంచారు.

అభ్యర్థి ఎవరైనా కూటమి పార్టీగా డీఎండీకే మద్దతు తెలపాలని బీజేపీ నేతలు కోరుతుండగా, విజయకాంత్ నోరుమెదపలేదు. నామినేషన్ గడువు దగ్గరపడుతున్న సమయంలో ఇక జాప్యం చేస్తే లాభం లేదని భావించిన బీజేపీ ఐదు పేర్లను పరిశీలించింది. చివరకు తమ పార్టీ నేతైన సుబ్రమణియన్‌ను రంగంలోకి దించింది.
 
అన్నాడీఎంకేలో బంగారు బహుమతులు
శ్రీరంగం ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ చూసిన బూత్ నిర్వాహకులకు బంగారు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 29 మంది మంత్రులతో కూడిన బృందం గురువారం రాత్రి శ్రీరంగానికి చేరుకుంది. వెంటనే సమావేశమై ప్రచార బాధ్యతల నిమిత్తం నియోజకవర్గాన్ని విభజించుకుని రంగంలోకి దిగారు.

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో జయలలితకు 43 వేల ఓట్ల మెజారిటీ రాగా అంతకు మించి మెజార్టీ సాధించాలని పార్టీ ఆదేశించింది. నియోజకవర్గంలో మొత్తం 322 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఓట్ల లెక్కింపులో ఏ బూత్ నుంచి అధికారపార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయో ఆ ప్రాంత ఇన్‌చార్జ్‌కు ఒక పౌను బరువున్న బంగారు నాణాన్ని బహుమతిగా ఇస్తామని పార్టీ ప్రకటించింది.

పైగా జయ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని ప్రకటించడంతో పార్టీ నేతలు మరింత ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, అదే షరతుపై రెండుపౌన్ల బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తానని తిరుచ్చీ జిల్లా కార్యదర్శి మనోహరన్ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు