రజనీకాంత్‌ను రానీయండి చూద్దాం

28 Jun, 2017 07:53 IST|Sakshi
హ హ్హ హ్హా.. మా స్టైలే వేరు!

‘హ హ్హ హ్హా.. మా స్టైలే వేరు’ అన్నది తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనుకుంటున్నారా.. కానే కాదు. రజనీకాంత్‌ను రాజకీయ ముగ్గులోకి దించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాటలవి. తమిళ రాష్ట్రాల్లో రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం పుదుచ్చేరికి చేరుకున్న అమిత్‌షా ప్రముఖ తమిళ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇవీ..


పూర్తిస్థాయి బలగంతో బలోపేతం
తమిళనాడు, పుదుచ్చేరిల కోసం మాస్టర్‌ ప్లాన్‌
అన్నాడీఎంకేది అంతర్గత వ్యవహారం
రజనీకాంత్‌ను రానీయండి చూద్దాం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంతరంగం


సాక్షి ప్రతినిధి, చెన్నై:
ప్రశ్న : తమిళనాడులో రాజకీయ కల్లోలం ఏర్పడి ఉండగా దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అధ్యక్షునిగా మీరు ఎలాంటి చొరవ తీసుకుంటారు?
అమిత్‌షా: ఇది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం ఇందులో మేం జోక్యం చేసుకోకూడదు. అయినా, తమిళ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేవలం అండగా నిలుస్తాం.

ప్రశ్న : అత్యంత ప్రజాదరణ కలిగిన జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు మీ వద్ద ఏదైనా పథకం ఉందా?
అమిత్‌షా:  జాతీయ దృక్పథంతో పార్టీ, ప్రభుత్వం దేశాభివృద్ధికి పాటుపడుతోంది. అదే సమయంలో తమిళనాడులో అవినీతిరహిత ప్రభుత్వానికి, నేతకు కేంద్ర సహకారం ఎలాగూ ఉంటుంది.

ప్రశ్న: తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలం గా లేదు. మీ పార్టీ నేతలకు మధ్య సమన్వయం లేదు. ఈ పరిస్థితిలో పార్టీ అధ్యక్షుడుగా ఎవరిని నిలబెడితే తమిళనాడులో బీజేపీ బలపడుతుంది?
అమిత్‌షా: తమిళనాడులో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలపరిచేందుకు పూర్తిస్థాయి కార్యకర్తలను, పర్యవేక్షకులను నియమిస్తున్నాం. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో 40 నుంచి 50 మందితో బృందాలను ఏర్పాటు చేసి, ప్రజాభిప్రాయం సేకరిస్తాం. పార్టీ, ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళతాం. వీటి ఆధారంగా తమిళనాడు, పుదుచ్చేరికి ఒక ఫార్ములా సిద్ధం చేసుకుంటాం. ప్రధాని వాటికి మార్గదర్శకం చేస్తారు. ఇదే మా పార్టీ స్టైల్‌. తమిళనాడులో పార్టీ బలో పేతం, అధికారం కోసం కోసం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం.

ప్రశ్న : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను నమ్మి తమిళనాడులో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు నిజంగానే ప్రజల్లో అంత పరపతి ఉందా?
అమిత్‌షా: రజనీకాంత్‌కునిజంగానే ప్రజల్లో ఎంతో పరపతి ఉంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. మొదట ఆయన నిర్ణయం తీసుకోనివ్వండి ఆ తర్వాత మాత్రమే మా వ్యూహం ఉంటుంది. రజనీ బీజేపీలో చేరాలనుకుంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పార్టీ నేతతో చర్చించి ఒక నిర్ణయానికొస్తాం.

ప్రశ్న : ఢిల్లీలో పోరాటం చేసిన తమిళనాడు రైతులను మోదీ పట్టించుకోలేదనే విమర్శ ఉంది. వ్యవసాయ రుణాల రద్దు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడిచేసి మీరు మంచి పేరు తెచ్చుకుని ఉండవచ్చుకదా ?
అమిత్‌షా:  రైతుల సమస్యలు రాష్ట్రస్థాయిలోనివి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాలి. రైతులు తమ పోరాటాన్ని చెన్నైలో నిర్వహించి ఉంటే బాగుండేది.
 

ప్రశ్న : నీట్‌ పరీక్ష తమిళనాడు ప్రజల విద్యావకాశాలను దెబ్బతీసింది. రాష్ట్ర స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నీట్‌ పరీక్షలో కనీసం పాస్‌ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. ఈ కారణంగా ప్రాంతీయ భాషల రాష్ట్రాలను నీట్‌ నుంచి మినహాయించేలా నిర్ణయం తీసుకోవచ్చుకదా ?
అమిత్‌షా:  నీట్‌ పరీక్ష సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. ఇంగ్లీషు భాషలోనే నీట్‌ పరీక్షలు నిర్ణయించాలని న్యాయస్థానం సూచించినపుడు కేంద్రం జోక్యం చేసుకుని ప్రాంతీయ భాషా రాష్ట్రాలకు అనుగుణంగా మార్పులు చేయాల్సిందిగా సూచించింది. అంతేకాక రాష్ట్రాలకు ఏడాది కాలం మినహాయింపు ఇచ్చి, ఆ తర్వాతనే నీట్‌ పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర సిలబస్‌ను తయారుచేసే నిపుణులతో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా సమస్యలు లేని విధంగా నీట్‌ పరీక్షలు నిర్వహించేలా కృషి చేస్తాం. కోర్టు ఆదేశాలను అమలుచేయడం ప్రభుత్వాల విధి. నీట్‌ పరీక్ష నుంచి మినహాయించాలని కోరుతూ రాష్ట్రాలే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.

ప్రశ్న : తమిళనాడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కావేరి వాటా జలాల విడుదలపై కర్ణాటక ప్రభుత్వం నాటకాలాడుతోంది. నదుల అనుసంధానంపై బీజేపీ ఇప్పటికే అనేకసార్లు ప్రస్తావించింది. నదుల అనుసంధానాన్ని తమిళనాడు నుంచి ప్రారంభించగలరా?
అమిత్‌షా:  నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కావేరి అనుసంధానంపై మూడు రాష్ట్రాలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న : పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌బేడీ రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్టు అధికార పార్టీ విమర్శిస్తోంది కదా?
అమిత్‌షా:  పుదుచ్చేరి పాలనలో నేను ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాను. అవినీతిని అణచివేసే అధికారం గవర్నర్లకు ఉంది. పుదుచ్చేరిలో అవినీతి రాజ్యమేలుతున్నందున గవర్నర్‌ బేడీ ఆమె బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు
.

మరిన్ని వార్తలు