శివసేనకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫర్‌?

27 Feb, 2017 12:02 IST|Sakshi
శివసేనకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫర్‌?

ముంబై : బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు అయినా ఇప్పటికీ మేయర్‌ పదవిపై ఉత్కంఠ వీడలేదు.  బీఎంసీ ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. అయితే  ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య డీల్‌ కుదిరిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 

అంతేకాకుండా శివసేన-బీజేపీ పార్టీలు మేయర్‌ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎంజీ వైద్య ఓ సూచన కూడా చేయడం గమనార్హం. మరోవైపు శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీనే ముందుగా మేయర్‌ పదవి చేపట్టవచ్చని ఆయన ఆదివారంనాడు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంజీ వైద్య వ్యాఖ్యలపై రెండు పార్టీలు ఇప్పటివరకూ స్పందించలేదు.

కాగా బీఎంసీలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ అధికారం ఏర్పాటు చేసేందుకు శివసేన-బీజేపీలకు సమాన అవకాశాలున్నాయి. దీంతో ఇరుపార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు 31మంది కార్పొరేటర్లను గెలుచుకున్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఇటు బీజేపీ, అటు శివసేనే కానీ సిద్ధంగా లేవు. అలాగే ఇండిపెండెంట్ల మద్దతు, గెలిచిన తిరుగుబాటుదారులు సొంతగూటికే చేరడంతో శివసేనకు 89మంది కార్పొరేటర్ల బలం ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇప్పటికే  పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని  సూచించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు