అధ్యక్షుడిగా యడ్యూరప్పే దీటైన వ్యక్తి

9 Mar, 2016 03:44 IST|Sakshi

సాక్షి, బళ్లారి : రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానానికి మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు యడ్యూరప్పనే దీటైన వ్యక్తి అని మాజీ ఉప ముఖ్యమంత్రి, విధాన పరిషత్ ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన బళ్లారి నగరంలోని జిల్లా కోర్టుకు ఓ కేసు విచారణకు హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం యడ్యూరప్పకే ఇవ్వాలని తనతో పాటు రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయ పడుతున్నారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసం ఉందన్నారు.
 
  రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా  కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. రాష్ట్ర సీఎం నిద్ర మత్తులో ఉన్నారని ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డులో రూ.2.40 కోట్ల మేర అవినీతి జరిగిందని, దీనిపై ఏర్పాటు చేసిన సమితి నివేదిక విధానసభ, విధాన పరిషత్‌కు సమర్పించినప్పటికీ ఏ విధమైన  చర్యలు తీసుకోలేదని, దీనిపై హైకోర్టు కూడా నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచిం చినప్పటికీ ఇంతవరకు అందజేయకపోవడం శోచనీయమన్నారు.
 
 రాష్ట్రంలో సీ కేటగిరి గనులను వేలం వేయాలని సుప్రీంకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందని ధ్వజమెత్తారు. లోకాయుక్త నియాయకంపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందన్నారు. ఎమ్మెల్సీ శశీల్ నమోషి, మాజీ విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు