భౌతిక దూరం పాటించని బీజేపీ ఎమ్మెల్యే

10 Apr, 2020 09:37 IST|Sakshi

రాంచీ : మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించడమే ప్రధాన ప్రత్యామ్నాయామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. దీనికోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పక్కా ఏర్పాట్లు చేశాయి. నిత్యావసర వస్తువుల దుకాణాల దగ్గర, మెడికల్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి సమయంలో ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన ఓ ప్రజాప్రతినిధి లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించారు. ధనాబాద్‌ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సిన్హా గురువారం స్థానిక జార్ఖండ్‌ మైదాన్‌లో పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

అయితే వందాలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే పరివారం కూడా భారీగానే వచ్చింది. వారందరూ తమ ప్రియతమనేత చుట్టూ గుమిగూడటం మరో విశేషం. అయితే జార్ఖండ్‌ మైదాన్‌లో జరిగే ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇక దీనిపై జార్ఖండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ‘చట్టం అందరికీ వర్తిస్తుంది. ప్రజలకు సూచనలు ఇవ్వాల్సిన ఓ ప్రజాప్రతినిధే ఇలా చేయడం అత్యంత ప్రశంసనీయం’ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.  

ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ సామాజిక దూరం సూచనను పాటించడం లేదని రాష్ట్ర బీజేపీ ప్రతినిధి అజయ్‌ రాయ్‌ విమర్శించారు. ముఖానికి మాస్క్‌ కూడా ధరించడం లేదని గుర్తుచేశారు. అయితే తమ ఎమ్మెల్యే నిబంధనలను పాటించకపోతే పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పక తీసుకుంటుందుని  తెలిపారు. భౌతిక దూరం పాటించాలనే నియమాన్ని అందరూ పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాజాసి​న్హా చేపట్టిన కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు చేపడతామన్నారు. ఇక ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా చేయడం భావ్యం కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.  

చదవండి:
లాక్‌డౌన్‌: 40 కి.మీ. నడిచి.. ప్రియుడిని కలుసుకుని..
కరోనా వైరస్‌ ; నటుడిపై దాడి

మరిన్ని వార్తలు