హైవేను దిగ్బంధించిన బీకేయూ కార్యకర్తల అరెస్టు

7 Dec, 2013 22:33 IST|Sakshi
 ముజఫర్‌నగర్: గత గురువారం (డిసెంబర్ 5) ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారి, ఇతర రాష్ర్ట రహదారులను దిగ్బంధించిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయించారు. సుమారు 250 మందికి పైగా కార్యకర్తలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో బీకేయూ డివిజనల్ అధ్యక్షుడు చందర్‌పాల్ ఫోజీ, జిల్లా అధ్యక్షుడు రాజు అహ్లావత్, మహిళా నేత సోహన్‌బిరి దేవి తదితరులు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని చెరుకు రైతులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, చెరుకు మద్దతు ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఐదున బీకేయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, తమ ఆందోళనకారులు ఆ రోజు మూడు గంటలపాటు జాతీయ రహదారి సహా ఖటౌలీ, ఫలౌడా, మిరాన్‌పూర్, పిన్నా, లాలూఖేరీ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులను దిగ్బంధించడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైందని పోలీసులు తెలిపారు. అలాగే ఒక గంటపాటు ఢిల్లీ-కల్కా రైలును సైతం మన్సూర్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారని  చెప్పారు. 
 
మరిన్ని వార్తలు