మెట్రోరైల్లో బ్లాక్‌బాక్స్‌లు

19 Apr, 2016 02:37 IST|Sakshi
మెట్రోరైల్లో బ్లాక్‌బాక్స్‌లు

సాక్షి ప్రతినిధి, చెన్నై: మెట్రోరైల్ ప్రయాణం ఇక మరింత సురక్షితం. ప్రమాదాలను నమోదు చేయగల విమాన తరహా బ్లాక్‌బాక్స్‌లను చెన్నై మెట్రోరైళ్లలో అమర్చారు.   సుందర చెన్నైని మరింత సుందరంగా మారుస్తూ నిర్మితమైన మెట్రోరైల్ గత ఏడాది జూన్ 29న ప్రారంభమైంది. మొత్తం 45.1 కిలోమీటర్ల దూరం కారిడార్‌కు గాను తొలిదశగా 10 కిలోమీటర్లను ప్రారంభించారు. కోయంబేడు-ఆలందూర్ మధ్య మాత్రమే తిరిగే ఈ మెట్రో రైళ్లకు అధిక చార్జీలు వసూలు చేయడం వల్ల ఆశించినంత ఆదరణ లభించలేదు. మెట్రోరైలు ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఈ 9 నెలల కాలంలో ఓ మోస్తరుగా పుంజుకోవడంతో యాజమాన్యం కొత్త అంశాలపై దృష్టి పెట్టింది.
 
బ్లాక్‌బాక్స్‌ల అమరిక:   విమానం తరహాలో చెన్నైలో పరుగులు తీసే మెట్రోరైళ్లలో బ్లాక్‌బాక్స్‌లను ఇటీవలే అమర్చారు.  విమానంలోని బ్లాక్‌బాక్స్‌ల వలెనే ఇవి కూడా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తాయి. విమానాల్లో డేటా రికార్డర్ అనే బ్లాక్‌బాక్స్‌ల ఏర్పాటు ఉంటుంది. విమానానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆ బ్లాక్‌బ్లాక్స్‌లు తనంత తానుగా రికార్డు చేస్తుంటాయి. విమానం ప్రమాదానికి గురైన పక్షంలో ఆ బ్లాక్‌బాక్స్‌ను సేకరించి దానిలో రికార్డయిన అంశాలద్వారా కారణాలను విశ్లేషిస్తారు.

ఇలా విమానాల్లోని బ్లాక్‌బాక్స్ మాదిరే మెట్రోరైళ్లలో ఈవీఆర్ అనే ఈవెంట్ రికార్డర్ అనే సాధనాన్ని అమర్చారు. ఈ సాధనం మెట్రోరైల్ కంట్రోలు రూమ్, నిర్వాహకుల నెట్‌వర్క్ సిస్టమ్‌తో అనుసంధానమై ఉంటుంది. రైలు ప్రయాణించే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే వాటిని ఈవీఆర్ వెంటనే కనుగొని డ్రైవర్ దృష్టికి తీసుకెళుతుంది. అలాగే మెట్రో రైలులో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీని సైతం ఒకటిగా సేకరించి నెట్‌వర్క్ వీడియో రికార్డరు అనే సాధనంలోకి చేరుస్తుంది. ఇన్ని కోణాల్లో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఏదేని కారణాల చేత ప్రమాదం చోటుచేసుకున్న పక్షంలో ఈ రికార్డు ద్వారా అందే సమాచారంతో అదే రకమైన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ సహాయ మేనేజర్ ఆర్ శ్రుతిశాంభవి తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా