చెన్నైకు బ్లాక్‌బాక్స్

13 Jul, 2015 08:36 IST|Sakshi
చెన్నైకు బ్లాక్‌బాక్స్

చెన్నై: గల్లంతైన కోస్టుగార్డు విమానానికి చెందిన బ్లాక్‌బాక్స్‌ను ఆదివారం చెన్నైకు చేర్చారు. దీనిని పరిశీలించిన అధికారులు బెంగళూరు లేదా, కాన్పూర్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యారు. గస్తీలో ఉన్న భారత కోస్టుగార్డుకు చెందిన సీజీ-791 విమానం గత నెల ఎనిమిదో తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. దీని కోసం శతవిధాలుగా గాలింపు జరిపినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో ఆ విమానం బ్లాక్‌బాక్సు తమకు లభించినట్టుగా శనివారం కోస్టుగార్డు వర్గాలు ప్రకటించాయి. దీంతో ఇక ఆ విమానంలో ఉన్న అధికారులు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది. ఆ విమానం సముద్రంలో కుప్ప కూలినట్టు నిర్ధారణ అయింది. ఇందుకు కారణం చిదంబరం సమీపంలో 950 అడుగుల లోతులో ఈ బ్లాక్‌బాక్సు కూరుకు పోయి ఉండడమే.
 
 ఎట్టకేలకు ఆ బాక్సును అతి కష్టం మీద సముద్రం నుంచి బయటకు తీశారు.  తమకు లభించిన  ఆ బాక్సును ఆదివారం చెన్నైలోని కోస్టుగార్డు కార్యాలయానికి తరలించారు. అక్కడ అధికారులు ఆ బాక్సును పరిశీలించారు. ఈ బాక్సులో చివరి సమయంలో నమోదైన రికార్డు వివరాలు, పెలైట్ చివరి సంభాషణ తదితర వివరాలు నమోదై ఉండేందుకు అవకాశాలు ఎక్కువే. దీంతో ఏమి జరిగిందోనన్న వివరాలను ఆ బ్లాక్స్ మాత్రమే స్పష్టం చేయనున్నది. దీంతో ఆ బాక్సులోని వివరాలను తెలుసుకునేందుకు బెంగళూరు లేదా, కాన్పూరులోని వైమానిక పరిశోధన కేంద్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ పరిశోధన కేంద్రాల్లో జరిపే పరిశీలన మేరకు విమానం ప్రమాదం కారణంగా కుప్ప కూలిందా..? మరేదేని కారణాలు ఉన్నాయా..? అన్నది స్పష్టం కానున్నది.
 

మరిన్ని వార్తలు