నల్లధనంపై నిఘా

15 Mar, 2014 22:54 IST|Sakshi
 న్యూఢిల్లీ:ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ పార్టీలు/అభ్యర్థులు అక్రమంగా నగదు/ నల్లధనాన్ని తరలించకుండా నిరోధించడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దీనికితోడు అక్రమ నగదు తరలింపుల గురించి అందే ఫిర్యాదులపై విచారణ కోసం ఢిల్లీ ఐటీశాఖ ప్రధాన కార్యాలయంలోనే ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రచారం సందర్భంగా నల్లధనం ప్రవాహాన్ని అరికట్టాలన్న ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నారు. అక్రమ నగదును అరికట్టడానికి హెల్ప్‌లైన్, కంట్రోల్‌రూమ్ 24 గంటలూ పనిచేస్తాయి. ఐటీశాఖ జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి వీటిని పర్యవేక్షిస్తారు. నల్లధనాన్ని తరలించే వారిపై చర్యలు తీసుకోవడం, తనిఖీలు నిర్వహించడానికి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని కూడా నియమించారు. అక్ర మ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడం, పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు లంచాలు ఇవ్వకుండా చూడడానికి ఈసీ ఢిల్లీలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది.
 
 ఇది వరకు పలుచోట్ల దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంది. ముందుజాగ్రత్తగా పలువురు నేరగాళ్లను అరెస్టు చేయించిం ది. లెసైన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10న నిర్వహించే పోలింగ్ కోసం శనివారం నోటి ఫికేషన్ వెలువడింది. దీని జారీతో మొదలయ్యే నామినేషన్ల పర్వం ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. అదే రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 26 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ.  ఎన్నికల సంఘం అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ ఢిల్లీలోని తొమ్మిదింటిలో రెండు జిల్లాల్లో నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు చేయలేదని వివరణ ఇచ్చారు. మధ్య ఢిల్లీ, నైరుతి ఢిల్లీ జిల్లా అధికారులను జిల్లా ఎన్నికల అధికారులుగా నియమించలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ రెండు జిల్లాల్లోని ప్రాంతాలు నాలుగు లోక్‌సభ స్థానాల కిందకు వస్తున్నందున వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించలేదని పేర్కొంది.  
 
 ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రతిపాదనకు ఓకే 
 లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. ఓటింగ్ ప్రక్రియను ఉదయం ఒక గంటల ముందుగా ఆరంభించి సాయంత్రం ఒక గంట  ఆలస్యంగా ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఉదయం, సాయంత్రం ఎన్నికల సమయాన్ని ఒక గంట  చొప్పున పొడగించడం వల్ల ఏప్రిల్ 10న ఢిల్లీలోని పోలింగ్‌బూత్‌లలో ఉదయం  ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సమయం సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన తరువాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో వరుసల్లో నిలబడి ఉండడంతో ఐదు గంటల తరువాత కూడా ఓటింగ్ కొనసాగించవలసి వ చ్చింది. ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తించిన ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి విజయ్‌దేవ్ లోక్‌సభ ఎన్నికల కోసం ఓటింగ్  సమయాన్ని రెండు గంటలు పెంచవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. లోక్‌సభ ఎన్నికలు వేసవిలో జరుగుతున్నాయి కాబట్టి ఓటర్లు మధ్యాహ్నాని కన్నా ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటు వేయడానికి ఎక్కువగా వస్తారని దేవ్ అన్నారు.
 
 తొలిరోజు 8 నామినేషన్లు
 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం ఢి ల్లీ నుంచి శనివారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా, మిగతా వాళ్లు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు. చాందినీచౌక్ లోక్‌సభ స్థానానికి రెండు, ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ కోసం నాలుగు, తూర్పు, న్యూఢిల్లీ లోక్‌సభ స్థానాల కోసం ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు అందాయని సంఘం అధికారులు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి ఆశుతోష్ ముద్గిల్, నయాదౌర్ పార్టీ అభ్యర్థి ధన్‌రాజ్ చౌహాన్ చాందినీచౌక్‌లో పోటీకి నామినేషన్లు సమర్పించారు. నేఫ్‌సింగ్ రాజ్‌పుత్, దినేశ్‌పాల్ సింగ్, ఎస్‌యూసీఐ అభ్యర్థి నరేంద్ర శర్మ, అగర్ జనపార్టీ అభ్యర్థి ఏకే అగర్వాల్ ఈశాన్య ఢిల్లీ కోసం నామినేషన్లు వేశారు. తూర్పుఢిల్లీలో పోటీ కోసం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మంజు చిబ్బర్, స్వతంత్ర అభ్యర్థి మహారాజ్ కుమార్ న్యూఢిల్లీ స్థానం పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
 

 

మరిన్ని వార్తలు