హోరెత్తిన ఎన్నికల ప్రచారం

24 Apr, 2016 02:55 IST|Sakshi
హోరెత్తిన ఎన్నికల ప్రచారం

దూసుకెళుతున్న అన్నా డీఎంకే, పీఎంకే పార్టీలు
 
హొసూరు: తమిళనాడు శాసనసభకు మే 16న సాధారణ ఎన్నికలు జరుగునున్నాయి. నామినేషన్ల ఘట్టం 22వ తేదీ నుండి ప్రారంభమైంది. క్రిష్ణగిరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే ముందంజలో ఉంది. డీఎంకే కూటమిలో డీఎంకే పోటీ  చేసే నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎండీకే కూటమిలో పోటీ చేస్తున్న సీపీఐ  ప్రచారం వేగంగా సాగుతోంది. మండుటెండలు అభ్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.


హొసూరు: హొసూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలు ప్రచారంలో నువ్వా, నేనా అనే విధంగా  పోటీ పడుతున్నాయి. బీజేపీ   మూడవ స్థానంలో, డీఎండీకే నాల్గవ స్థానంలో ప్రచారంలో  ఉన్నాయి. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించలేదు. హొసూరులో అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు.

తళి: తళి నియోజకవర్గంలో సీపీఐ, డీఎంకే పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థి ప్రచారంలో మూడవ స్థానంలో ఉన్నారు. బీజేపీ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. పీఎంకే అభ్యర్థిని మార్చడంతో  పీఎంకే ప్రచారం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేదు. కన్యాకుమారి జిల్లా అంత విస్తీర్ణంలో  ఉన్న తళి నియోజకవర్గంలోప్రచారం కష్టం అంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు.

వేపనహళ్లి: వేపనహళ్లి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారంలో మొదటి స్థానంలో, డీఎంకే రెండవ స్థానంలో, పీఎంకే, డీఎండీకే పార్టీలు మూడు, నాల్గవ స్థానంలో నిలిచాయి.

క్రిష్ణగిరి: క్రిష్ణగిరి నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికల ప్రచారంలో పోటీ పడుతున్నాయి. డీఎండీకే తదితర పార్టీల ప్రచారం అంతంత మాత్రంగానే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

బర్గూరు: బర్గూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇతర పార్టీల ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది.

ఊత్తంగేరి: ఊత్తంగేరి రిజర్వ్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి మనోరంజితం నాగరాజుపై అసంతృప్తి ఉన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఇక డీఎంకే అభ్యర్థి కూడా అన్నాడీఎంకేకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డీఎండీకే కూటమిలో విడుదలై చిరుత పార్టీ ప్రచారం ప్రారంభించింది.

మరిన్ని వార్తలు