షారుఖ్ ర్యాంప్ కూల్చివేత

15 Feb, 2015 03:48 IST|Sakshi
షారుఖ్ ర్యాంప్ కూల్చివేత

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన నివాసం ‘మన్నత్’ బంగ్లా వెలుపల రోడ్డును ఆక్రమించి నిర్మించిన ర్యాంప్‌ను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసి) ఎట్టకేలకు కూల్చివేసింది. ఈ అక్రమ నిర్మాణంపై బీఎంసీ ఇటీవలే షారుఖ్ ఖాన్‌కు ఓ నోటీసు జారీ చేసింది. సదరు నోటీసుకు షారుఖ్ ఖాన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో శనివారం ఉదయం బీఎంసీ సిబ్బంది బుల్డోజర్ సహాయంతో ఆ ర్యాంప్‌ను కూల్చివేశారు. మన్నత్ బంగ్లా బయట తన ‘వానిటీ వాన్’ పార్కింగ్ కోసం షారుఖ్ ఖాన్ ఈ ర్యాంప్ నిర్మించారు. దీని కారణంగా 9.5 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు కాస్తా 6.15 మీటర్లకు కుదించుకుపోయింది. దీంతో ఈ రోడ్డుపై వచ్చేపోయే వారికి, వాహనాలకు ఇబ్బందిగా మారింది.
 
  చారిత్రాత్మకమైన మౌంట్ మేరి చర్చివైపు వెళ్లే ఈ రోడ్డుపై తరచుగా వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక మౌంట్ మేరీ జాతర సమయంలో ప్రజలు భారీగా తరలి రావడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు ఈ ర్యాంప్‌ను తొలగించాలని బీఎంసీకి ఫిర్యాదు చేశారు. అది పట్టించుకోకపోవడంతో వారు స్థానిక పార్లమెంటు సభ్యురాలు పూనం మహాజన్‌కు తమగోడును చెప్పుకున్నారు. దీంతో పూనం షారుక్ పేరును ప్రస్తావించకుండానే, రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ర్యాంప్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఎంసీకి ఒకలేఖ రాశారు. మున్సిల్ కమిషనర్ సీతారామ్ కుంటేకు పూనమ్ రాసిన ఈ లేఖ మీడియాలో రావడంతో ఆ అంశం అంతటా చర్చనీయం అయింది. దీంతో ఈ వివాదం మరింత ముదరకముందే, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీతారామ్ కుంటే ఆదేశాల మేరకు బీఎంసీ సిబ్బంది ర్యాంప్‌ను కూల్చివేశారు.
 

మరిన్ని వార్తలు