బకాయిలు చెల్లించండి

18 Mar, 2014 22:52 IST|Sakshi

సాక్షి, ముంబై: గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పడిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడ ంతో నోటీసు జారీ చేయాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించే విషయంపై ఈసీ నోరు విప్పడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వాటిని చెల్లించాలని నోటీస్‌లో హెచ్చరించనున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని స్పష్టం చేశారు.

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎంసీకి చెందిన 63 వాహనాలు, స్థలాలు, కార్యాలయాలు, సుమారు ఐదు వేల మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ వినియోగించుకుంది. ప్రతీ వాహనానికి రోజుకు రూ.2,000 అద్దె, స్థలాలు, కార్యాలయాలు, సిబ్బంది వేతనాలకు.. ఇలా కోట్ల రూపాయల బకాయిలు పడింది. వీటిని చెల్లించేంతవరకు బీఎంసీ వాహనాలు, స్థలాలు, సిబ్బందిని ఈసీకి మరోసారి ఇవ్వబోమని అడ్తాని స్పష్టం చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పనులకు 8,000 మంది సిబ్బంది కావాలని బీఎంసీ పరిపాలన విభాగాన్ని ఈసీ కోరింది. అయితే 6,500 మంది సిబ్బందిని ఇచ్చేందుకు బీఎంసీ అంగీకరించింది. మిగతా సిబ్బందిని ఈసీ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకుంది. వీరంతా గురువారం ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతారని అడ్తాని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం నగరంలో మొత్తం 10,600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద అధికారులను నియమిస్తారు. ఎన్నికల విధుల్లో ముంబైలోని బీఎంసీ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 75 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
 

మరిన్ని వార్తలు