‘విమానాల్లో బాంబు’ కలకలం

6 Sep, 2015 04:14 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: స్థానిక కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడు విమానాల్లో బాంబులు పెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అది నిజం కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు హెచ్.ఎస్.ఆర్ లేవుట్‌కు చెందిన  వ్యక్తి తాను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టినట్లు వాట్స్‌అప్‌లో మెసేజ్ పంపారు.

అంతేకాకుండా  ఓ బ్యాంకు అకౌంట్ నంబర్ ఇచ్చి అందులో కోటి రూపాయలు వేస్తే ఎక్కడ పెట్టినది చెబుతానని పేర్కొన్నారు. దీంతో అధికారులు హుటాహుటిన అన్ని విమానాల్లో కూడా వెదికి ఎక్కడా కూడా బాంబు ఆనవాళ్లు కనబడలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు బయలు దేరాల్సిన విమానాలు దాదాపు 6 గంటలు ఆలస్యంగా బయలు దేరాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాంబు పెట్టినట్లు వాట్స్‌అప్ మెసేజ్ పంపిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకుని మడివాళపోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు