ఐపీఎల్ కంటే ప్రజలు ముఖ్యం కాదా?

6 Apr, 2016 14:07 IST|Sakshi
ఐపీఎల్ కంటే ప్రజలు ముఖ్యం కాదా?

ముంబై: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ సీజన్ ఆరంభంకావాల్సి ఉండగా, మహారాష్ట్రలో మ్యాచ్ల నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్ల కంటే నీరు ముఖ్యమని, నీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోకుంటే ఐపీఎల్ మ్యాచ్లను మహారాష్ట్ర నుంచి వేరే చోటకు తరలించాలని బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం పిచ్ల తయారీకి నీటిని వృథా చేయడం పట్ల ఎంసీఏను  తప్పుపట్టింది. మహారాష్ట్రలో కరువు, నీటి కొరత కారణంగా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించరాదంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది.

'నీళ్లను ఎందుకు వృథా చేస్తారు? ఐపీఎల్ కంటే ప్రజలు ముఖ్యం కాదా? ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారు? నీటిని వృథా చేయడం నేరం. మహారాష్ట్రలోని కరువు పరిస్థితుల గురించి మీకు తెలుసు కదా' అంటూ బాంబే హైకోర్టు ఎంసీఎకు ప్రశ్నల వర్షం కురిపించింది. నీటిని వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మహారాష్ట్రలో గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు తాండవిస్తున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను రాష్ట్రంలో నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఈ నెల 9న ఆరంభమవుతాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ అనిశ్చితిలో పడింది.

మరిన్ని వార్తలు