రెండూ ముఖ్యమే

26 May, 2014 22:39 IST|Sakshi
రెండూ ముఖ్యమే

ముంబై: దబంగ్, రౌడీ రాథోడ్ లాంటి మసాలా సినిమాలతోపాటు నటనకు ఎక్కువ అవకాశం ఉండే లుటేరా వంటి సినిమాలూ తనకు ముఖ్యమేనని సోనాక్షి సిన్హా చెబుతోంది. సల్మాన్ సినిమా దబంగ్‌తో బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె తదనంతరం రౌడీ రాథోడ్, బుల్లెట్‌రాజా, ఆర్..రాజ్‌కుమార్, దబంగ్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి సినిమాల్లో కనిపించింది. వీటిలో చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హాలిడే సోనాక్షి తాజా సినిమా. ‘లుటేరా వంటివి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి మంచి స్క్రిప్టు ఉన్నవి చాలా తక్కువగా వస్తాయి.

మసాలా సినిమాలను కూడా నేను బాగా ఇష్టపడతాను. ఇలాంటి వాటిలో నటించేందుకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రెండు రకాల సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తాను. కథ ఎంపికలో మనసు చెప్పిందే చేస్తాను. వద్దనుకుంటే తిరస్కరించడానికి వెనుకాడను’ అని చెప్పింది. ఇక హాలీడేలో సోనాక్షి ఆధునిక కాలేజీ యువతిగా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరున థియేటర్లకు వస్తుంది. ఇందులో పాత్ర తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, క్రీడాకారిణిగానూ కనిపిస్తానని ఈ బ్యూటీ చెప్పింది. స్కూలు వయసులో చాలా ఆటలు ఆడేదానినని , ఇందులో బాక్సర్ స్టూడెంట్‌గా కనిపిస్తానని తెలిపింది. ఉగ్రవాదం చుట్టూ తిరిగే ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని చెప్పింది. ‘సెలవుల కోసం ఇంటికి వచ్చిన సైనికుడిగా కొన్ని అక్రమాల గురించి తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హీరోయిన్ బాక్సింగ్ చేయాలి కాబట్టి ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ దగ్గర కొంచెం సాధన కూడా చేశాను. నగర జీవితం నాకు అలవాటే కాబట్టి కాలేజీ యువతి పాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు’ అని సోనాక్షి సిన్హా వివరించింది.

>
మరిన్ని వార్తలు