దేవ.. దేవ

12 Dec, 2016 14:47 IST|Sakshi
దేవ.. దేవ
ప్రశ్నార్థకంగా మారనున్న దేవాదుల ఎత్తిపోతల పథకం భవిష్యత్‌  
ఏజెన్సీ కక్కుర్తితో పాడవుతున్న మోటార్లు
అనుభవం లేని ఇంజనీర్ల పర్యవేక్షణ
నిర్దేశిత పంపింగ్‌ లక్ష్యానికి ఆటంకాలు
 
సాక్షి, వరంగల్‌ : దేవాదుల ఎత్తిపోతల పథకం మోటార్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కంపెనీ నిర్వాకం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. మోటార్ల నిర్వహణ బాధ్యతలను సొంతగా ఎలాంటి అనుభవం లేని సంస్థకు సాగునీటి శాఖ అప్పగించింది. ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థ అనుసరిస్తున్న వైఖరి మొత్తం ప్రాజెక్టు మనుగడకే ఇబ్బందులు కలిగించేలా ఉంది.
 
బ్రెజిల్‌ మోటార్లు
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బ్రెజిల్‌ నుంచి భారీ మోటార్లను దిగుమతి చేసుకున్నారు. అయితే, భారీ మోటార్ల వారం టీ గడువు ముగిసింది. ఈ మేరకు నిర్వహణ, మరమ్మతుల ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మోటార్లలో సాంకేతిక సమస్యలు వస్తే బ్రెజిల్‌కు చెందిన ఇంజనీర్ల బృందం మరమ్మతు చేయాలి. కానీ అక్కడి నుంచి వచ్చే ఇంజనీర్ల బృందం... మోటార్లను మరమ్మతు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తే ఇక వాటి ని బ్రెజిల్‌కు తరలించాల్సిందే. తద్వారా మరమ్మతుకు ఖర్చు ఎక్కువ కావడమే కాకుం డా చాలా సమయం పడుతుంది. మరమ్మతుల కోసం మోటార్లను బ్రెజిల్‌ తీసుకు వెళ్తే దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో ఇబ్బం దులు ఏర్పడుతాయి. వర్షాభావ ప్రాంతాలకు నీరు అందించడంలో అవాంతరాలు వస్తాయి. ఇలా కాకుండా మోటార్ల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటే భారీ మరమ్మతులను నియంత్రించేందుకు వీలవుతుంది. మోటార్ల నిర్వహణ కాంట్రాక్టు పొందిన సంస్థ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సా గునీటి శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మోటార్లను నడిపే విషయంలో నిపుణులను నియమించుకుంటే చిన్నస్థాయి సమస్యలకు వెంటనే అరికట్టొచ్చు. అయితే, కాంట్రాక్టు పొందిన సంస్థ మాత్రం దీనికి విరుద్ధంగా తక్కువ వేతనం ఇచ్చి జూనియర్‌ ఇంజనీర్లను నియమించి వారికి భారీ మోటార్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.
 
కూలెంట్‌ అయిల్‌ లేక...
నెల క్రితం భీంఘన్ పూర్‌ పంప్‌హౌజ్‌లోని నీటిని పంపింగ్‌ చేస్తున్న సమయంలో మోటార్లలోని కాయిల్స్‌ కాలిపోయినట్లు తెలిసింది. సరిపడా కూలెంట్‌ అయిల్‌ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని కాంట్రాక్టు సంస్థకు అధికారులు చెప్పినట్లు తెలిసింది. నెల గడిచినా ఇప్పటికీ మోటార్లు రిపేరు చేయలేదని అధికారులు అంటున్నారు. ఏటూరునాగారంలోని దేవాదుల ఇన్ టేక్‌ వెల్‌ వద్ద ఉన్న ఇలాంటి మరో మోటారును తమకు తెలియకుండానే తీసుకొచ్చి భీంఘన్ పూర్‌ వద్ద అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాయిల్స్‌ కాలిపోయిన మోటారును మరమ్మతు కోసం పుణకు తరలించినట్లు తెలిసింది. దేవాదుల ప్రాజెక్టులోని భారీ మోటార్లను తరలించాలంటే భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏటూరునాగారం ఇన్ టేక్‌ వెల్‌ మోటారును ఎవరికీ తెలియకుండానే కాంట్రాక్టు సంస్థ భీంఘన్ పూర్‌కు తరలించినట్లు తెలిసింది. ఇలా తరలించే క్రమంలో మోటారు కింద పడిపోయినట్లు సాగునీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు.
మరిన్ని వార్తలు