ఢిల్లీలో డెంగీ వ్యాధితో ఐదుగురి మృతి

21 Sep, 2013 01:31 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: డెంగీ రక్కసి మరోసారి దాడి మొదలుపెట్టింది. ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 912 మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడగా, ఐదుగురు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 14 నుంచే వ్యాధి తీవ్రత ఏకంగా 95 శాతం పెరిగిందని ఆస్పత్రులు చెబుతున్నాయి. ఎంసీడీ మాత్రం ఈ ఏడాది ఇద్దరు మాత్రమే డెంగీ వ్యాధి తో మరణించారని ప్రకటించింది. ఈ నెల ఐదున మరణించిన అశోక్‌నగర్‌వాసిని ఫూల్‌సింగ్‌గా (47), తొమ్మిదిన మరణించిన ప్రతాప్‌నగర్‌వాసిని ప్రియాంకగా గుర్తించారు. ఎంసీడీ దోమల నిరోధక విభాగంలో పనిచేసే తరుణ్ ఇందూరియా ఈ నెల ఒకటిన డెంగీతో మరణించినట్టు వార్తలు వచ్చినా ఎంసీడీ మాత్రం ధ్రువీకరించలేదు. సుజన్‌సింగ్ పార్కువాసి సునీతా, డాక్టర్ రామన్ అరోరా అనే ఇద్దరు కూడా డెంగీతో మరణించిన ట్టు డాక్టర్లు తెలి పారు. వీరిద్దరూ ఈ నెల తొమ్మిదిన మూల్‌చంద్ ఆస్పత్రిలో మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి 888 డెంగీ కేసులు నమోదు కాగా, మిగతా కేసులు హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చాయని వైద్యశాఖ తెలిపింది. ఇక ఉత్తరఢిల్లీలో అత్యధికంగా 477 మంది ఈ వ్యాధి బారినపడినట్టు ఎంసీడీ వెల్లడించింది. జోన్ల వారీగా పరిశీలిస్తే రోహిణిలో అత్యధికంగా 192 మంది, నరేలాలో 109 మందికి డెంగీ సోకింది. 
 
 ప్లేట్‌లెట్లకు పెరిగిన డిమాండ్
 డెంగీ విజృంభణ ఎంతమాత్రమూ తగ్గకపోవడం తో ఈ వ్యాధి చికిత్సకు అవసరమయ్యే ప్లేట్‌లెట్స్‌కు (రక్తకణాలు) డిమాండ్ పెరిగింది. డెంగీ బారిన పడినవారిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతుంది. దీంతో రోగులకు ప్లేట్‌లెట్స్ ఎక్కించడం అనివార్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో సాధారణంగా ప్లేట్‌లెట్స్ సంఖ్య లక్షన్నర నుంచి నాలుగు లక్షలు ఉంటుంది. డెంగీ రోగుల్లో మాత్రం ఇవి వేగంగా తగ్గిపోతాయి. ప్లేట్‌లెట్స్ తయారయ్యే ప్రక్రియ మందగించడమే ఈ పరిస్థితికి కారణం. ప్లేట్‌లెట్స్  సంఖ్య 20 వేల కన్నా తగ్గితే రక్తస్రావం కావడంతో పాటు ఒంటిపై దద్దు ర్లు వస్తాయి. రక్తస్రావాన్ని నిరోధించడానికి వెంటనే  ప్లేట్‌లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది.  ఢిల్లీలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు  912 డెంగీ కేసులు నమోదయ్యాయి. రోగుల సంఖ్య  పెరగడంతో గత  రెండు వారాలుగా రోజుకు 100 యూనిట్లకుపైగా ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేస్తున్నట్లు ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. గత నెలలో రోజుకు దాదాపు 10 యూనిట్ల వరకు ప్లేట్‌లెట్స్ జారీ చేశామని, ఈ నెల ఇది 100 యూనిట్లను దాటిందని పేర్కొంది. కొన్నిసార్లు రోజుకు 200 యూనిట్లు కూడా ఇస్తున్నామని రెడ్‌క్రాస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఎస్పీ అగర్వాల్ చెప్పారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి ప్లేట్‌లెట్స్‌కు డిమాండ్ బాగా ఉందన్నారు. 
 
 బొప్పాయికి పెరిగిన గిరాకీ 
 న్యూఢిల్లీ: బొప్పాయికి డెంగీని నయం చేసే శక్తి ఉన్నదీ లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ చాలా మంది బాధితులు మాత్రం వీటి ఆకులను చికిత్సకు వినియోగిస్తున్నారు. బొప్పాయి ఆకులకు ప్లేట్‌లెట్స్ పెంచే గుణం ఉంటుందని చెబుతారు. దీంతో వీటి ఆకుల కోసం చాలా మంది నర్సరీలకు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు చాలా మంది ఇళ్లలోని బొప్పాయి చెట్ల ఆకులు అదృశ్యమయ్యాయి. బొప్పాయి మొక్కలు కావాలంటూ చాలా మంది సంప్రదిస్తున్నారని, తమ దగ్గర తగినన్ని మొక్కలు ఉన్నాయని పండారారోడ్డులోని మసీద్ నర్సరీ డెరైక్టర్ విక్రమ్ సైనీ చెప్పారు. 
 
 వారంలో కనీసం 25 మంది వరకు బొప్పాయి కోసం వస్తున్నారని లాడోసరాయిలోని గ్రీన్‌వే నర్సరీకి చెందిన వైసీ సింగ్ అన్నారు. విత్తనాలను రూ.20 చొప్పున, మొక్కలను రూ.25 చొప్పున అమ్ముతున్నామని తెలిపారు. వీటి ఆకులు ప్లేట్‌లెట్లను పెంచుతాయని నిరూపించే ఆధార మేదీ లేదని డాక్టర్లు అంటున్నారు. బొప్పా యి వల్ల వ్యాధి నయమయిందని పలువురు రోగులు తనతో అన్నారని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యుడు సురోం జిత్ చటర్జీ చెప్పారు. అయితే డెంగీ దానికదే తగ్గుతుంది కాబట్టి, 95 శాతం మంది చికిత్స లేకుండానే కోలుకునే అవకాశముంటుందని సర్‌గంగారామ్ ఆస్పత్రి డాక్టర్ బియోత్రా అన్నారు. డెంగీ బాధితులు మాత్రం బొప్పాయి ఆకులను ఉడకబెట్టాక రసం తీసి తాగితే తప్పకుండా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
>
మరిన్ని వార్తలు