ఖనిజ దందాకు బ్రేక్..

4 Nov, 2016 02:12 IST|Sakshi
ఖనిజ దందాకు బ్రేక్..

జీవో 124పై ఎన్జీటీ స్టే.. రాష్ట్ర సర్కారుకు చెంపపెట్టు.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని స్కెచ్‌కి చెక్
 
- ఆశ్రీతుని మేలు కోసమే అడ్డగోలు జీవో..
- ఏపీఎండీసిని రంగంలోకి దింపి అభాసుపాలు..
- గుంటూరు జిల్లాలో ఏళ్లుగా అక్రమ తవ్వకాలు
- హైకోర్టు ఆదేశాలనే అమలు చేసే పరిస్థితి లేదు..
- లోకాయుక్త విచారణలో బయటపడ్డ అక్రమాలు..
 
 సాక్షి, అమరావతి: అధికారపార్టీ ఎమ్మెల్యేకి మేలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమేఘాలపై జారీ చేసిన ఓ అడ్డగోలు జీవోకు బ్రేక్ పడింది. గుంటూరు జిల్లాలో 95 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) బ్రేక్ వేసింది. తదుపరి  ఆదేశాలు జారీ చేసే వరకూ ఈ జీవోను ఆమలు చేయరాదని ఆదేశించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో 95 ఎకరాలను ఏపీఎండీసీకి రిజర్వు చేస్తూ  ఈ ఏడాది సెప్టెంబరు ఏడో తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబరు 124 దీంతో ఆగిపోయింది.

గనుల తవ్వకాలు జరపకూడని ప్రాంతంలో ప్రభుత్వం  ఏపీఎండీసీకి సున్నపురాయి నిక్షేపాలను రిజర్వు చేయడం చట్ట విరుద్ధమని, అందువల్ల దీనిని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని గుంటూరు జిల్లాకు చెందిన టీజీవీ కృష్ణారెడ్డి ఎన్‌జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే పులిచింతల నిర్వాసిత కాలనీ వాసులు దుమ్ము, కాలుష్యం బారిన పడతారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్నందున ఇక్కడ తవ్వకాలు జరపడం ప్రమాదకరమని కూడా వివరించారు. ఇందుకు సంబంధించి గతంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), గనుల భద్రత సంచాలకులు ఇచ్చిన నివేదికలను కూడా ఆధారాలుగా సమర్పించారు. ఏపీఎండీసీని పావుగా వాడుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పులను ఒప్పులుగా మార్చడం, టెండరు పేరుతో ఖనిజ నిక్షేపాలను కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టీకరించారు.

ఈ ప్రాంతంలో ఖనిజ అక్రమ తవ్వకాలకు అడ్డకట్ట వేయాలని, ఇప్పటి వరకూ ఖనిజ సంపదను దోచుకున్న వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావడంలేదని వివరించారు. వీటిని పరిశీలించిన ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ జీవో 124ను అమలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు జీవో 124పై ‘స్టే’ ఉత్తర్వులను రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి, భూగర్భ గనుల శాఖ సంచాలకులకు, ఏపీఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్‌కు పంపించింది.

 ‘పచ్చ’దండు దందా ఇదీ..
  గుంటూరు జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించడం ద్వారా కోట్లు దండుకుంటుంటే... మరో ఎంపీ సోదరుని సంస్థ జీవీపీ ఇన్‌ఫ్రా 982 ఎకరాల అభయరణ్యానికే ఎసరు పెట్టేందుకు స్కెచ్ వేసింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే మరీ బరితెగించి లీజులు లేకుండానే సున్నపురాయిని అడ్డగోలుగా తవ్వించి పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వందల కోట్లు దండుకుంటున్నారు. జాతీయ సంపదైన ఖనిజ నిక్షేపాలను కాపాడాల్సిన, అక్రమ తవ్వకాలను, తరలింపును అడ్డుకోవాల్సిన భూగర్భ గనుల శాఖ కళ్లుండీ చూడలేని కబోదిలా మారింది. అయితే లోకాయుక్త డెరైక్టర్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో తన అక్రమ తవ్వకాల దందాకు అడ్డుకట్టపడే ప్రమాదముందని గ్రహించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అక్రమాలను ‘చట్టబద్ధం’ చేసుకునే దిశగా పావులు కదపడం.. అందుకోసం రాష్ర్టప్రభుత్వం ఏకంగా ఏపీఎండీసీనే రంగంలోకి దించి ఆగమేఘాలపై జీవో జారీ చేయడం గమనార్హం..

 ఎమ్మెల్యే స్కెచ్ ప్రకారమే జీవో..
 హైకోర్టు ఆదేశాలు కూడా అమలుకావడంలేదని లోకాయుక్త నివేదిక ఇవ్వడం, ఎప్పటికైనా తాము నివేదిక సమర్పించక తప్పదని జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేయడంతో అక్రమ తవ్వకాలను ‘చట్టబద్దం’ చేసుకోవాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేపై అనేక అభియోగాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలవల్ల లీజులు ఇచ్చే పరిస్థితి లేదని గనుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏపీఎండీసీకి ఈ ప్రాంతాన్ని రిజర్వు చేయించి ఆ సంస్థ ద్వారా ఖనిజ తవ్వక అధికారాలు పొందడం ఉత్తమమని గ్రహించి ఎమ్మెల్యే చకచకా పావులు కదిపారు. యరపతినేని స్కెచ్‌వేశారు.. దానికి రాష్ర్టప్రభుత్వం సరేనంది.

దాంతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలోని 690, 691, 692 సర్వే నంబర్లలో 95 ఎకరాలను తమకు రిజర్వు చేయాలంటూ ఏపీఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించగా దానిని సర్కారు ఆమోదించి జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం ఈ నిక్షేపాల ప్రాంతాన్ని రిజర్వు చేసిందే తడవుగా... ఇక్కడ ఖనిజ తవ్వకం, ఖనిజ నాణ్యత పెంపు కోసం ఆసక్తిగల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలంటూ ఆగస్టు నాలుగో తేదీన ఏపీఎండీసీ ఓ ప్రకటన జారీ చేసింది. టెండరు పేరుతో ఖనిజ నిక్షేపాలను యరపతినేనికి కట్టబెట్టేందుకే ఈ మొత్తం తంతు  చేపట్టారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఏపీఎండీసీ అనేక చోట్ల సున్నపురాయి, ఐరన్‌ఓర్, బాక్సైట్, బెరైటీస్, బీచ్‌శాండ్ తదితర మైనింగ్ లీజులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులనే సరిగా చేసుకోలేక ఏళ్లతరబడి పనులు ముందుకు సాగడంలేదు. ఇలాంటి పరిస్థితిలో కోనంకిలో అదీ పులిచింతల పునరావాస ప్రాజెక్టు నిర్వాసిత కాలనీ డేంజర్ జోన్‌లో ఉన్న ప్రాంతాన్ని రిజర్వు చేయించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. యరపతినేని కోసమే దీనిని చేపట్టి ఏపీఎండీసీ అభాసుపాలైంది’ అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

 టీడీపీ అధికారంలోకి రాగానే...
 కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం పిడుగురాళ్ల, కోనంకి గ్రామాల పరిసరాల్లో సున్నపురాయి నిక్షేపాలను స్థానిక కూలీలతో అక్రమంగా తవ్వించి విక్రయించడం ద్వారా కొంతమేరకు ఆర్జించిన  యరపతినేని టీడీపీ అధికారంలోకి వచ్చాక  అడ్డూ అదుపూ లేకుండా రేయింబవళ్లు అక్రమ తవ్వకాలు సాగించారు. ఈ ఖనిజాన్ని  సిమెంటు కర్మాగారాలకు  సరఫరా చేస్తూ వందల కోట్లు ఆర్జించారు. అనుమతులు లేకుండా యరపతినేని సున్నపురాయి నిక్షేపాలను తవ్విస్తున్నా అధికారయంత్రాంగం అడ్డుకోలేదు.

 ‘పిల్’తో వెలుగులోకి...
 టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగిస్తున్న ఖనిజ దందా చూసి ఆవేదన చెందిన గుంటూరుకు చెందిన కె.గురువాచారి 21-08-2015న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారించిన హైకోర్టు అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేయడంతోపాటు ఇందుకు బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని వారి నుంచి అపరాధ రుసుంతో సహా వసూలు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, గనుల శాఖ అధికారులను ఆదేశిస్తూ గత మార్చి 28న ఆదేశాలు జారీ చేసింది. తన తీర్పు తర్వాత కూడా అక్రమ తవ్వకాలు కొనసాగితే జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాలని కె.గురువాచారికి హైకోర్టు సూచించింది. అయినా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేగానీ,  ఎస్పీ నారాయణ నాయక్ గానీ   హైకోర్టు ఆదేశాల అమలుకు సాహసించలేకపోయారు.

 అక్రమాలను బైటపెట్టిన లోకాయుక్త విచారణ..
 టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగిస్తున్న గనుల దందాపై  పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అన్నపురెడ్డి హనిమిరెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త విచారణ విభాగం ఇన్‌ఛార్జి డెరైక్టర్ కె.నరసింహారెడ్డి విచారణ చేసి  లోకాయుక్త రిజిష్ట్రార్‌కు  నివేదిక సమర్పించారు. పిడుగురాళ్ల, కోనంకి ప్రాంతాల్లో 2014కు ముందు స్థానిక కూలీలతో ఎమ్మెల్యే యరపతినేని సున్నపురాళ్లను తవ్వించే వారనీ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఎదురు లేదనే ధీమాతో అడ్డూఅదుపూ లేకుండా ఖనిజాన్ని తవ్వి  తరలిస్తున్నారేది అందరికీ తెలిసిన అంశమేనని లోకాయుక్త డెరైక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో యరపతినేని అక్రమాలను నిరోధించే సాహసం ఎవరూ చేయలేదని ఆయన నివేదికలో స్పష్టం చేశారు.  హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్‌ను ఆదేశిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని డెరైక్టర్ కె.నరసింహారెడ్డి  పేర్కొన్నారు.

 కాలుష్య నియంత్రణమండలి వద్దన్నా...
 ఇక్కడ తవ్వకాలు సాగిస్తే పులిచింతల నిర్వాసిత కాలనీ వాసులు కాలుష్యంవల్ల అనారోగ్యాల బారిన పడతారు. ఈ ప్రాంతం డేంజర్ జోన్ పరిధిలో ఉన్నందున తవ్వకాలు జరపరాదని గనుల భద్రత సంచాలకులు గతంలో నివేదిక ఇచ్చారు. ఇక్కడ తవ్వకాలు జరిపితే దుమ్ము, కాలుష్యం వల్ల నిర్వాసిత కాలనీ వాసులు ఇబ్బంది పడతారనే కారణంగానే గతంలో ఆరు సంస్థలు మైనింగ్ కార్యకలాపాల కోసం పెట్టుకున్న కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎఫ్‌ఈ) దరఖాస్తులను కాలుష్య నియంత్రణ మండలి తిరస్కరించింది. అయినా అధికారపార్టీ ఎమ్మెల్యేకోసం రాష్ర్టప్రభుత్వం ఆ ప్రాంతంలో మైనింగ్ జరిపేందుకు అనుమతించే దిశగా అడుగులు వేసింది.
 
 ‘‘గుంటూరుజిల్లాలో ఖనిజ అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే అధికాార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కాబట్టి జిల్లా కలెక్టరు కాంతిలాల్ దండే, ఎస్పీ కూడా భయపడి మిన్నకుండిపోతున్నారు. ఖనిజ అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేయడమే కాక చట్టవిరుద్ధంగా ఖనిజ నిక్షేపాలను తరలించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా కలెక్టరు, ఎస్పీలు ఉన్నారు.’’ -లోకాయుక్త వ్యాఖ్య ఇది..
 
 గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, గనుల శాఖఅధికారులు అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలి. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని వారి నుంచి అపరాధ రుసుంతో సహా వసూలు చేయాలి.     
- 2015 ఆగస్టు 28న హైకోర్టు తీర్పుమరిన్ని వార్తలు