ఆ ‘కోడలే’ మా బ్రాండ్ అంబాసిడర్

19 May, 2015 00:31 IST|Sakshi
ఆ ‘కోడలే’ మా బ్రాండ్ అంబాసిడర్

- ‘చైతాలి’ని ప్రచారకర్తగా నియమించిన సులభ్ ఇంటర్నేషనల్
- రూ. 10 లక్షల పారితోషికంతో సత్కారం
సాక్షి, ముంబై:
తాను అడుగుపెట్టబోయే అత్తారింట్లో మరుగుదొడ్డి ఉండి తీరాలనే పట్టుబట్టిన నవ వధువు చైతాలికి పేరు ప్రఖ్యాతులతోపాటు నగదు జల్లు కురిసింది. సులభ్ ఇంటర్నెషనల్ సంస్థ ఏకంగా రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వడంతోపాటు తమ సంస్థకు ప్రచార కర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమించుకోనుంది. ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన ఈ పని రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది.
 వివరాల్లోకెళితే.. రాష్ట్రంలోని అకోలా జిల్లా కారంజా రమజాన్‌పూర్‌కు చెందిన చందా అలియాస్ చైతాలి వివాహం ఈ నెల 15న జరిగింది. తాను అడుపెట్టబోయే అత్తారింట్లో మరుగుదొడ్డి లేదని, పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగుదొడ్డి ఇవ్వాలని తల్లిదండ్రులను, దగ్గరి బంధువులను కోరంది. ఆమె కోరుకున్న ప్రకారం ఫ్రీ-ఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్డిని అందజేశారు. ఈ కథనాన్ని ‘సాక్షి’ సోమవారం ‘అత్తారింటి దారిదే’ శీర్షికతో ఫ్యామిలీ పేజీలో ప్రచురించింది.

విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్.. ఆమెను యువతులంతా ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో రూ.10 ల క్షల నగదు బహుమతితో పాటు, తమ సంస్థ ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఈ సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను గౌరవించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అనితా నరేను రూ.ఏడు లక్షలు పారితోషికం ఇచ్చి గౌరవించింది. రాష్ట్రానికి సంగీత అనే యువతి, అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రయాంక భారతి, మరో ఇద్దరు మహిళలు తమ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి మరుగుదొడ్డిని నిర్మించుకున్నందుకు సులభ్ ఇంటర్నేషనల్ గౌరవించింది.

మరిన్ని వార్తలు