ఫైర్ స్టేషన్లు కావాలి

28 Apr, 2014 22:36 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 67 అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కి నగర అగ్నిమాపక శాఖ  ప్రతిపాదించింది. దీంతో అత్యవసర సమయంలో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని భారీ నష్టం జరగకుండా నివారించవచ్చని తెలిపింది.

 ప్రస్తుతం నగరంలో కేవలం 33 అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న నగరం విస్తరిస్తోంది. దీనికి తోడు వలసలు జోరందుకున్నాయి. దీంతో నగరం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలలో జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 33 అగ్నిమాపక కేంద్రాలు ఎటూ సరిపోవడం లేదు. ప్రమాదం జరిగిన చోటికి పగలు (ట్రాఫిక్ జాం లేని పక్షంలో) 15 నిమిషాల్లో, రాత్రులు ఐదు నుంచి పది నిమిషాల్లో చేరుకుంటాయి. అదే ట్రాఫిక్ జాంలో ఘటనాస్థలికి చేరుకోవాలంటే కనీసం అర గంటకుపైనే సమయం పడుతుంది.

అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతోంది. అగ్నిమాపక కేంద్రాలు దూరంగా ఉండడంవల్ల ఘటనాస్థలికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. పైగా నగరంలో ఇరుకు రోడ్లు, సందులు ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రమాదం జరిగిన చోటికి ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి విడతలో 26 కేంద్రాలను నిర్మించాలి. ఆ తర్వాత మిగతా కేంద్రాలను ఏర్పాటుచేస్తే సకాలంలో ఘటన స్థలానికి చేరుకునేందుకు వీలుంటుందని ముంబై అగ్నిమాపక శాఖ బీఎంసీకి సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొంది.

 నగరంలో ఏడు నుంచి 10 కి.మీ. దూరంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంది. ఒకవైపు నగరంలో పెరిగిపోయిన ఆకాశహార్శ్యాలు, టవర్లు వారికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. మరోవైపు విదేశాల మాదిరిగా భవనాలకు అద్దాలు అమర్చడంవల్ల మంటల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో మంటలను అదుపుచేయడం వారికి పెను సవాలుగా మారనుంది. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక పరికరాలు స్వయంగా యాజమాన్యాలే అమర్చుకోవాలని బీఎంసీ ఆంక్షలు విధించింది. ఈ ప్రకారం ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. చిన్నాచితక ప్రమాదాలైతే వారే మంటలను ఆర్పివేసుకుంటారు. అయితే భారీ ప్రమాదాలైతే అగ్నిమాపక వాహనాలు రావాల్సిందే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాం కనబడుతోంది. ఇలాంటి సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే ట్రాఫిక్ జామ్‌లో దారి వెతుక్కుంటూ ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకునే సరికి నష్టం జరిగిపోతుంది. దీన్ని నివారించేందుకే ప్రతి రెండు, మూడు కి.మీ. దూరంలో ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నగర అగ్నిమాపక శాఖ తెరమీదకు తీసుకొచ్చింది.

 6,630 పక్షులను కాపాడిన సిబ్బంది
 అగ్నిమాపక సిబ్బంది గత సంవత్సర కాలంలో ఏకంగా 6,630 పక్షులను కాపాడారు. నగరంలో 2,230 పక్షులు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 4,400 పక్షులను రక్షించగలిగారు.  ఒక్కోసారి వాటిని కాపాడే ప్రయత్నంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. మాండ్వీ అగ్నిమాపక కేంద్రానికి చెందిన ఉమేష్ పర్వతే పావురాన్ని కాపాడబోయి చనిపోయాడు. ‘సంక్రాంతి పండుగ సమయంలో అత్యధిక శాతం పక్షులు పతంగుల దారం (మాంజ)లో చిక్కుకుని గాయపడతాయి. ఆ తర్వాత వేసవి కాలంలో తాగు నీరు లభించకపోవడంతో నేల రాలుతుంటాయి. కొన్ని చెట్ల కొమ్మల్లో, కేబుల్ వైర్లలో, తీగల్లో చిక్కుకుని విలవిలలాడుతుంటాయి. ఎవరైన ఫోన్‌తో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకొని వాటిని రక్షిస్తామ’ని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

 ‘రికార్డులు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి’
 ముంబై: గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల రికార్డులు 2012లో జరిగిన మంత్రాలయ ఆగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంత మంది ఎంపీలు కోడ్‌లు ఉల్లంఘించారనే వివరాలు కావాలని ఈ ఏడాది ఏప్రిల్ ఏడున ఆర్టీఐ ద్వారా ఆయన సమాచారాన్ని కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు