అంత సొల్లొద్దు

15 Feb, 2017 02:15 IST|Sakshi
అంత సొల్లొద్దు

బాబుకు బ్రిటన్‌ షాక్‌!
రాజధానిపై ఊహాగానాలు కాకుండా వాస్తవాలు చెప్పాలని సూచన
లండన్‌ పర్యటన రద్దు చేసుకున్న సీఎం
ఆయన స్థానంలో మంత్రి నారాయణ


సాక్షి, అమరావతి: చంద్రబాబుకు బ్రిటన్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దీంతో ఆయన తన లండన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో మంత్రి నారాయణ వెళుతున్నట్లు సీఆర్‌డీఏ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ వాటర్‌ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్‌ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది.

అయితే సదస్సులో చెప్పాలనుకునే విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం కోరింది. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే చంద్రబాబు ఈసారి కూడా.. భవిష్యత్తులో ఎంత అద్భుతంగా రాజధానిని తీర్చిదిద్దబోయేదీ సవివరంగా తెలియజేసేలా ఓ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాబు డైరెక్షన్‌ మేరకు అధికారులు ప్రజెంటేషన్‌ను తయారు చేశారు.

చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా భూములిచ్చారని, ఆయన తన సమ్మోహనా శక్తితో లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ఇంటర్నేషనల్‌ స్కూళ్ళు, కాలేజీలు తరలి వస్తున్నాయని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాజధాని పరిధిలో భవిష్యత్‌లో 3 లక్షల ప్రత్యక్ష, 5.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్‌లతో సహా అద్భుత ఊహాచిత్రానికి రూపకల్పన చేసి సీడీ రూపంలో బ్రిటన్‌కు పంపారు. అయితే ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాగానాలు కాకుండా ఇప్పటివరకు సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని తెలిపింది. సదస్సులో వాస్తవాలను ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. లండన్‌ వేదికగా మరోసారి అంతర్జాతీయ సమాజానికి లెక్చర్‌ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఊహించని ఈ పరిణామంతో తన పర్యటన రద్దు చేసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి వెళ్లాల్సి ఉన్నా..
లండన్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సదస్సుకు వాస్తవంగా ముఖ్యమంత్రి వెళ్ళాల్సి ఉందని, కానీ ఆయన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆయన ప్రతినిధిగా మంత్రి నారాయణ వెళ్తున్నారని సీఆర్‌డీఏ మీడియా సలహాదారు ఎ. చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విష యమై సీఆర్‌డీఏ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారని, సదస్సులో ఏయే అంశాలను ప్రస్తా వించాలో వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

నేనొక్కడినే కష్టపడుతున్నా: చంద్రబాబు
మంత్రులెవరూ సరిగా పనిచేయడం లేదని మండిపాటు
రాష్ట్ర మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనొక్కడినే రాత్రిపగలూ పనిచేస్తున్నానన్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇకపై మంత్రులు, అధికారులను పరిగెత్తిస్తా నని హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవా రం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం లో మంత్రులు, టీడీపీ నేతల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వస నీయ సమాచారం మేరకు.. కొందరు మం త్రులు అధికారుల్లా ఫీలవుతున్నారని, ఒక్క రూ సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో మంత్రుల పర్యటనలు మొక్కుబడిగా మారాయని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపయో గం ఏమిటని ప్రశ్నించారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకోవాలని, తేలిగ్గా తీసుకుంటే కుదరదని చెప్పారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు గట్టిగా పనిచే యాలన్నారు. మరోవైపు మంత్రివర్గ సమావే శంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామి నేని శ్రీనివాస్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పూనం మాలకొం డయ్యపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా పథకం అమలును ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశా రు. ‘ఈ పథకాన్ని నువ్వు వదిలేశావ్‌..’ అని అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చినట్లు తెలిసింది. డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఈ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయని కామినేనిని ఉద్దేశించి చెప్పారు. రెండు సమావేశాల్లోనూ మంత్రులను టార్గెట్‌ చేసి బాబు మాట్లాడటంతో వారు అవాక్కయి నట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు శివాలెత్తడంపై మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇలావుండగా సమన్వయ సమావేశంలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను తిప్పికొట్టాలని మంత్రులు, టీడీపీ నేతలకు సూచించారు. ఏ పత్రికలోనైనా వ్యతిరేక వార్త వస్తే వెంటనే స్పందించి ఎదురుదాడి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

కోడెల వ్యాఖ్యలు వక్రీకరించిన వారిపై చర్యలు తీసుకుంటాం
స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని సమావేశంలో పలువురు నేతలు పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు.. శాసనసభాపతిపై ఆషామాషీగా కామెంట్లు చేస్తే ఇబ్బందులు పడతామని తెలిసేలా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.