చెన్నైలో జంట హత్యలు

5 Jul, 2017 22:38 IST|Sakshi

కేకేనగర్‌(చెన్నై): విడిపోయిన భర్తతో కలిసి కాపురం చేయడానికి అన్నతోపాటు చెన్నైకి వచ్చిన బెంగళూరు యువతి, ఆమె అన్న సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. హత్య చేసిన యువతి మామను పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై సమీపంలోని పల్లికరనై సాయ్‌బాలాజీ నగర్‌కు చెందిన కోశలన్‌ (65) ఆటోడ్రైవర్‌. ఆయన కుమారుడు వినాయకమూర్తి (28) కంప్యూటర్‌ ఇంజినీర్‌. అతనికి బెంగళూరుకు చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్‌ వరలక్ష్మి (26)తో నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. వినాయకమూర్తికి ప్రమాదంలో అనారోగ్యం పాలయ్యాడు. ఆ విషయాన్ని దాచి పెళ్లి జరిపించడంతో అతనితో కాపురం చేయడం ఇష్టంలేక పెళ్లయిన మూడు నెలలకే వరలక్ష్మి బెంగళూరులోని తన పుట్టింటికి వెళ్లి పోయింది.

 ఈ నేపథ్యంలో భర్తతో మళ్లీ కలిసి కాపురం చేయడానికి వరలక్ష్మి, అన్న కోదండం (30), అక్క భవాని (33) స్నేహితురాలు మాలతితో కలిసి బెంగళూరు నుంచి చెన్నైలోని భర్త ఇంటికి సోమవారం సాయంత్రం వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో కోశలన్‌ మాత్రమే ఉన్నాడు. వరలక్ష్మి వినాయకమూర్తితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడుతున్నట్లు కోదండం తెలిపారు. అయితే దీనికి కోశలన్‌ ఒప్పుకోలేదు. వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ సమయంలో కోదండం కోశలన్‌ను కొట్టాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన కోశలన్‌ వెంటనే ఇంట్లోకి వెళ్లి వేట కత్తితో వచ్చి అందరినీ నరికేస్తానని హెచ్చరించడంతో అక్కడి నుంచి వారంతా పరుగులు తీశారు.

 అయినా కోశలన్‌ వారిని వెంటాడి కోదండం, వరలక్ష్మిలను నరికి హత్యచేశాడు. అడ్డు వచ్చిన భవానికి కూడా కత్తిపోట్లు తగిలాయి. మాలతి పారిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సౌత్‌ చెన్నై పోలీసు జాయింట్‌ కమిషనర్‌ అన్బు, సహాయ కమిషనర్‌ గోవిందరాజ్, పోలీసులు అక్కడకు చేరుకుని కోదండన్, వరలక్ష్మి మృత దేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలకు పోరాడుతున్న భవాని, పల్లికరనైలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కోశలన్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. దీనిపై పల్లికరనై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు