బడ్జెట్ సమావేశాలు

9 Mar, 2015 22:27 IST|Sakshi

సాక్షి ముంబై: అనుకున్నట్టే బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అయితే కొద్దిసేపటికే ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. అనంతరం దివంగత ఉప ముఖ్యమంత్రి ఆర్‌ఆర్ పాటిల్, దివంగత సీనియర్ కమ్యూనిస్ట్ నేత గోవింద్ పాన్‌సరే, దివంగత శివసేన ఎమ్మెల్యే బాలా సావంత్ తదితరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ అసెంబ్లీ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్ర గవర్నర్ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి వల్ల రైతులు విలవిల్లాడుతోంటే.. వారికి కనీస మద్దతు లభించలేదని విపక్ష సభ్యులు విమర్శించారు. సీనియర్ కమ్యూనిస్టు నేత గోవింద్ పాన్‌సరే హత్య కేసులో ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ‘అమ్హీ సారే పాన్‌సరే’ (మేమందరం పాన్‌సరేలం) అంటూ నినాదాలు చేశారు. పాన్‌సారే హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇచ్చిన తేనేటి విందును బహిష్కరించిన విపక్షాలు... మొదటి రోజు దూకుడుతో వ్యవహరించాయి.
 
ఇచ్చిన హామీలను నెరవేర్చండి...
 -అజిత్ పవార్
 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు పూర్తి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు, వడగళ్ల వర్షం, పాన్‌సరే హత్యతో పాటు ముస్లిం రిజర్వేషన్ రద్దు, ధన్‌గర్ రిజర్వేషన్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.
 
ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి....  
 -ధనంజయ్ ముండే
గత మూడు నెలల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వంపై 302 సెక్షన్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వీరంగం సృష్టిస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం పడకలు కూడా లేవని ఆయన ఆరోపించారు. టామీ ఫ్లూ టాబ్లెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని..ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు