యూనిఫాం ఇవ్వలేదని డ్రైవర్‌ ధర్నా

11 May, 2018 07:58 IST|Sakshi
ప్రభుత్వ బస్సు ముందు ధర్నా చేస్తున్న డ్రైవర్‌ సురేష్‌

తిరువొత్తియూరు: యూనిఫాం ఇవ్వలేదని ప్రభుత్వ బస్సు ముందు కూర్చొని డ్రైవర్‌ ధర్నా చేసిన సంఘటన దిండుక్కల్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. దిండుకల్‌ సమీపం వత్తలగుండు ఊర్‌కాలన్‌ ఆలయ వీధికి చెందిన సురేష్‌ దిండుకల్‌ ప్రభుత్వ రవాణా సంస్థ శాఖ డిపో–3లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం దిండుకల్‌ నుంచి కుములికి వెళ్లడం కోసం బస్సును తీశాడు. ఆ సమయంలో అతను యూనిఫారం ధరించలేదు. దీన్ని గమనించిన ట్రాన్స్‌పోర్టు డిపో సహాయ ఇంజినీర్‌ అక్కడికి చేరుకుని సురేష్‌ను అడ్డుకున్నాడు.

దీంతో డ్రైవర్‌కు సహాయ ఇంజనీర్‌కు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన డ్రైవర్‌ సురేష్‌ బస్సు ముందు కూర్చొని ధర్నా చేశాడు. రవాణసంస్థ అధికారులు యూనిఫాం అందచేయకపోవడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశాడు. సురేష్‌ మాట్లాడుతూ తాను 2009 నుంచి పర్మినెంట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లుగా యూనిఫాం అందజేయలేదని, 2014 నుంచి యూనిఫాం కుట్టు కూలి నగదును ఇవ్వలేదని, దీనిపై మదురై డిపో జనరల్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపాడు. అధికారులు యూనిఫాం, కుట్టు కూలి నగదు అందజేయాలని కోరాడు.

మరిన్ని వార్తలు