పొట్టకోస్తే.. బంగారం బయటపడింది..!

18 Apr, 2014 23:44 IST|Sakshi

సింగపూర్ నుంచి అక్రమంగా  తీసుకొచ్చిన వ్యాపారి
వ్యూహం బెడిసికొట్టడంతో ఆస్పత్రిపాలు

న్యూఢిల్లీ: నీళ్ల సీసా మూత మింగానంటూ ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యాపారికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే అతని పొట్టలో నీళ్ల సీసా మూతకు బదులుగా 12 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఒక్కో బిస్కెట్ బరువు 33 గ్రాములు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే... చాందినీచౌక్‌కు చెందిన ఓ వ్యాపారి ఏప్రిల్ 7న సర్ గంగారాం ఆస్పత్రికి వచ్చాడు.

 ప్రమాదవశాత్తు తాను నీళ్ల సీసా మూత మింగానని, శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాలంటూ బతిమాలాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో సీనియర్ కన్సల్టింగ్ సర్జన్ డాక్టర్ సి.ఎస్ రామచంద్రన్ నేతృత్వంలోని ఓ బృందం మొదట ఎక్స్‌రే తీసింది. అందులో నీళ్ల సీసా మూత వంటి వస్తువేది కనిపించకపోగా లోహపు వస్తువులున్నట్లు గుర్తించారు.

అయితే వాటిని బంగారంగా గుర్తించని వైద్యులు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. పొట్టలోనుంచి బంగారు బిస్కెట్లు బయటకు వస్తుండడంతో వైద్యుల బృందం ఆశ్చర్యపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బిస్కెట్లు అతని పొట్టలోనుంచి బయటపడ్డాయి. శస్త్రచికిత్స పూర్తిచేసిన వైద్యులు వెంటనే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేశారు.

 వ్యాపారిని ఈ విషయమై ప్రశ్నించగా అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయమై రామచంద్రన్ మాట్లాడుతూ... ‘తరచూ ఆస్పత్రికి వచ్చే వ్యక్తి కావడంతో ముం దుగా మాకు ఎటువంటి అనుమానం రాలేదు. అప్పటికే అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశాం.

మొదటిసారి పిత్తకోశాన్ని తొలగించేందుకు, రెండోసారి అపెండిసైటిస్, మూడోసారి హెర్నియాకు సంబంధించి శస్త్రచికిత్సలు చేశాం. పైగా అతనికి మధుమేహం కూడా ఉంది. రోగి చరిత్ర ముందుగా తెలియడంతో ఉదరంలో ఏదైనా సమస్య కారణంగా ఆస్పత్రికి వచ్చాడని భావించాం.

 ఇక బంగారం ఎక్కడిది? అనే విషయాన్ని పక్కనబెడితే మొత్తానికి అతని ప్రాణాలను కాపాడినందుకు సంతోషంగా ఉంద’న్నారు. ఇదిలాఉండగా చాందినీచౌక్‌కు చెందిన సదరు వ్యాపారి పదిరోజుల క్రితమే సింగపూర్ నుంచి ఢిల్లీకి వచ్చాడని, బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చేందుకే బిస్కెట్ల రూపంలోకి మార్చి మింగాడని, మలద్వారం ద్వారా బయటకు వెళ్తాయనుకుని భావించినా అనుకున్న విధంగా జరగకపోవడంతో ఆందోళన చెందిన అతను వైద్యులను సంప్రదించాడని, అసలు విషయం దాచి.

 నీళ్ల సీసా మూత మింగానంటూ అబద్ధం చెప్పి ప్రాణాలను కాపాడుకున్నాడని కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు.పొట్టలో బంగారు బిస్కెట్లు ఉన్నాయని ముందుగానే చెబితే వైద్యులు శస్త్ర చికిత్స చేయరేమోనని భావించినందునే అలా అబద్ధం చెప్పి ఉంటాడన్నారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు