2030 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లోనే

23 Sep, 2014 02:46 IST|Sakshi
  • ఆ మేరకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి
  •  సీఎం సిద్ధరామయ్య
  • సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ గణాంకాలను అనుసరించి 2030 నాటికి కర్ణాటక జనాభాలో 50 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఆమేరకు పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి సహకరించాల్సిందిగా స్వీడన్ దేశ ప్రతినిధులను కోరారు. స్వీడన్ దేశ సహకారంతో ‘పట్టణ రవాణ వ్యవస్థ-ఉత్తమ భాగస్వామ్య పద్దతులు’ అనే విషయమై బెంగళూరులో సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది.

    కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధరామయ్య మాట్లాడుతూ... రవాణా వ్యవస్థ ఆయా ప్రాంతాల ఆర్థిక స్థితిగతులతో పాటు ప్రజల ఉత్తమ జీవన ప్రమాణాలకు నిదర్శనంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణాల్లో ముఖ్యంగా బెంగళూరులో రవాణా వ్యవస్థ సరిగా లేదన్నారు. ముఖ్యంగా పాదచారులకు అనువైన ఫుట్‌పాత్‌లు, సైకిలిస్టుల ప్రత్యేక మార్గాలు లేవన్నారు. వీటిని అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణానికి ఉపయోగమేకాకుండా ట్రాఫిక్ ఇబ్బందులను కూడా తప్పించవచ్చునన్నారు.

    వివిధ కారణాల వల్ల కర్ణాటలో పట్టణీకరణ పెరుగుతోందన్నారు. అందుకు అనుగుణంగా రవాణా వ్యవస్థను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇందుకు ప్రైవేటుతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అవసరమన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి హోదాలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు.

    బీదర్‌లో పాత్రికేయులపై దాడి సమర్థనీయం కాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో స్వీడన్ అంబాసిడర్ హెచ్.ఈ హరాల్డ్ సాండ్‌బర్గ్, ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారు జాన్సన్స్ హాప్‌స్ట్రోమ్, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, వినయ్‌కుమార్ సూరకే తదితరులు పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు