2030 నాటికి భారత్‌లో ఏడు మిలియన్ల మంది ‘అల్జీమర్ వ్యాధిగ్రస్తులు’

22 Sep, 2014 03:19 IST|Sakshi
  • అల్జీమర్స్‌పై చర్చా సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ
  • సాక్షి, బెంగళూరు : భారతదేశంలో 2030 నాటికి దాదాపు ఏడు మిలియన్ల మంది అల్జీమర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు తెలియజేస్తున్నాయని కొలంబియా ఏషియా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ తెలిపారు. వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారమిక్కడి కొలంబియా ఏషియా ఆస్పత్రిలో ‘అల్జీమర్స్’ వ్యాధిపై చర్చా సదస్సును నిర్వహించారు.

    ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ....వృద్ధాప్యం కారణంగా మెదడులోని కణాల పనితీరు క్షీణించడాన్నే అల్జీమర్స్‌గా పిలుస్తారని చెప్పారు. ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో సగటు వ్యక్తి ఆయుర్దాయం పెరుగుతుండటం అదే సమయంలో జననాల సంఖ్య తగ్గిపోతుండడం, రానున్న ఇరవై ఏళ్లలో అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్య పెరగడానికి ప్రముఖ కారణాలని తెలిపారు. ఇక ప్రస్తుత జీవన విధానం వల్ల కూడా రానున్న కాలంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని అన్నారు. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగానే కాక మానసికంగా కూడా సంతోషంగా, దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు.
     
    ఇదే విషయంపై ప్రజల్లో అవగాహనను పెంచడం కోసం కొలంబియా ఏషియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో కుటుంబసభ్యులతో ఎక్కువసేపు గడపడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన చుట్టూ సృష్టించుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, తద్వారా అల్జీమర్స్‌కు దూరంగా ఉండవ చ్చని సూచించారు.
     

మరిన్ని వార్తలు