ఉప సమరం

14 Nov, 2016 03:27 IST|Sakshi

ఊపందుకున్న ప్రచారం
అధికారుల మార్పులకు డీఎంకే పట్టు
తపాలా ఓటింగ్
తంజావూరులో నిలుపుదల
నారాయణ కోసం స్టాలిన్ ప్రచారం

సాక్షి, చెన్నై : ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం నేతలందరూ ఆయా నియోజకవర్గాల్ని ముట్టడించారు. రోడ్‌షోలతో, సభలతో, ప్రచార వాహనాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి గెలుపు కోసం నెల్లితోపులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆదివారం సుడిగాలి పర్యటన సాగించారు. ఇక, అరవకురిచ్చిలో తపాలా ఓటింగ్ సాగగా, డీఎంకే ఫిర్యాదుతో తంజావూరులో నిలుపుదల చేశాయి. ఇక, మూడు నియోజకవర్గాల్లోని స్థానిక అధికారుల్ని మార్చాల్సిందేనని ఎన్నికల యంత్రాంగాన్ని డీఎంకేపట్టుబట్టే పనిలో పడింది. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రచారం తారా స్థాయికి చేరింది.
 
నియోజకవర్గానికి పది మంది చొప్పున మంత్రులు మూడు నియోజకవర్గాల్లో తిష్ట వేసి తమ అమ్మ జయలలితకు గెలుపును కానుకగా సమర్పించేం దుకు చెమటోడ్చే పనిలో పడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మెజారిటీ శాతం మంది ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ఓటర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇక, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ తమ అభ్యర్థులు గెలుపు భారాన్ని తన భుజాన వేసుకుని ప్రచార రథంతో పరుగులు తీస్తున్నారు. వీరికి మద్దతుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ఓట్ల వేటకు శ్రీకారం చుట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ ప్రచారంలో దూసుకెళ్తుండగా, పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లతో అధికార, ప్రధాన ప్రతి పక్ష అవినీతిని దుమ్మెత్తి పోస్తూ, అధికారుల తీరుపై మండి పడే పనిలో పడ్డారు.  
 
పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి నెల్లితోపులో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా డీఎంకే ఓట్లను రాబట్టేందుకు దళపతి స్టాలిన్ సుడిగాలి పర్యటనతో దూసుకెళ్లారు. ఆదివారం ఎనిమిది చోట్ల ఏకంగా ఆయన ప్రచార రథంపై నుంచి ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రసంగాలతో ముందుకు సాగారు.
 
తపాల్ ఓటింగ్ : ఆదివారం ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బంది తపాల్ ఓటు హక్కును వినియోగించుకునే పనిలో పడ్డారు. అరవకురిచ్చిలో ప్రశాంతంగా ఓటింగ్ సాగగా, తంజావూరులో వివాదానికి దారి తీసింది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్‌డీవో సురేష్ తపాల్ ఓటింగ్‌ను నిలుపుదల చేశారు. తపాల్ ఓటింగ్‌లోనే అధికారులు తమ పనితనాన్ని అధికార పక్షానికి అనుకూలంగా చూపిస్తుండడంతో  డీఎంకే వర్గాల్లో కలవరం బయలు దేరింది. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న స్థానిక అధికారులు, సిబ్బంది, పోలీసుల్ని తక్షణం మార్చాలంటూ ఎన్నికల యంత్రాంగానికి విజ్ఞప్తి చేసే పనిలో ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ నిమగ్నమయ్యారు.
 
అధికారుల తీరును వివరిస్తూ , స్థానిక మార్పు డిమాండ్‌ను ఎన్నికల యంత్రాంగం ముందు ఫిర్యాదు రూపంలో ఉంచారు. అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలలో జరిగిన తపాల్‌ఓటింగ్‌ను రద్దు చేయాలని, మూడు నియోజకవర్గాల్లో మళ్లీ తపాల్ ఓటింగ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
రూ. 2.9 కోట్లు పట్టివేత : ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో తనిఖీలు ముమ్మరంగా ఆ మూడు నియోజకవర్గాల పరిధిలో సాగుతున్న విషయం తెలిసిందే. ఉదయాన్నే తేని నుంచి మదురై వైపుగా వెలుతునన వాహనాన్ని తనిఖీ చేయగా, రూ. 2.94 కోట్ల నగదు పట్టుబడ్డారుు. ఈ నగదు అంతూ రూ.ఐదు వందలు, రూ. వెరుు్య కాలం చెల్లిన నోట్లే. చివరకు ఆ నగదు సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు చెందినదిగా గుర్తించారు. తేని జిల్లా పరిధిలో నోట్ల మార్పిడి ద్వారా సేకరించిన పాత నోట్లను మధురై ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్టు తేలింది. అరుుతే, ఆ నగదు తరలింపునకు తగ్గ చలాన్లలో సంతకాలు సక్రమంగా లేని దృష్ట్యా, ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు