మంత్రి వర్గ సమావేశానికి అంబి గైర్హాజరు

29 Nov, 2014 03:54 IST|Sakshi
మంత్రి వర్గ సమావేశానికి అంబి గైర్హాజరు

నామినేటెడ్ పోస్టుల భర్తీలో  అనుయాయులకు స్థానం
లభించకపోవడంపై అసంతృప్తి
 

బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీలో తన అనుయాయులకు సముచిత స్థానం కల్పించకపోవడంపై రెబల్ స్టార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. గుల్బర్గాలో శుక్రవారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశానికి గైర్హాజరై తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. కల్బుర్గిలో నిర్వహించే మంత్రి వర్గ సమావేశానికి మంత్రులంతా తప్పక హాజరు కావాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెంగళూరులోని తన స్వగృహంలోనే అంబి ఉండిపోయారు. ‘నామినేటెడ్ పోస్టుల భర్తీలో అందరి మాటకు విలువ ఇచ్చి ఉండాల్సింది.

అలా కాకుండా తమంతట తామే అన్ని నిర్ణయాలు తీసుకుంటామంటే ఇక పార్టీ సీనియర్ నేతలుగా మేం ఉండి ఏం లాభం? తమకు ఇష్టమైన వారికే పదవులను ఇచ్చుకోమనండి, అయితే మమ్మల్ని ఓ మాట అడిగి ఉండాల్సింది కదా! మేమేమైనా మా అనుచరులకే పదవులు ఇవ్వమని అడుగుతున్నామా? వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని నాకూ తెలుసు, సిద్ధరామయ్య కంటే ముందు నుంచే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను’ అంటూ తన అసహనాన్ని మిత్రుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం వల్లే

ఇక మంత్రి వర్గ సమావేశానికి గైర్హాజరు కావడంపై అంబరీష్ శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నందున ఆ పనుల  ఒత్తిడి కారణంగానే తాను మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేక పోయానని తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు తనపైనే ఉన్నాయని చెప్పారు. వివిధ భాషలకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో తాను నగరంలోనే ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు.
 
 

మరిన్ని వార్తలు