కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

1 Aug, 2019 07:32 IST|Sakshi
చిక్కమగళూరు సమీపంలో చేతనహళ్లికి భౌతికకాయం తరలింపు

వీజీ సిద్ధార్థ్‌ అదృశ్యం విషాదాంతం   

నేత్రావతి నదిలో మృతదేహం లభ్యం   

చిక్కమగళూరులో కాఫీ ఎస్టేట్‌లో అంత్యక్రియలు  

ఏ కాఫీ తోటలతో ఆయన వ్యాపారఅధినేతగా ఎదిగారో చివరకు అవే కాఫీ తోటల్లో చితిమంటల్లో పంచభూతాల్లో కలిసిపోయారు. కోట్లాది మందికి కాఫీ రుచుల్ని చేరువ చేసిన కాఫీ డే స్థాపకుడు వీజీ సిద్ధార్థ్‌ చివరి ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. కుటుంబం,వేలాది మంది ఉద్యోగులు, మిత్రులనుంచి బాధాకరమైన రీతిలో వీడ్కోలు తీసుకున్నారు.  

సాక్షి, బెంగళూరు: ప్రముఖ కార్పొరే ట్‌ దిగ్గజం, కెఫే కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ్‌ విజయగాథ మధ్యలో విషాదంతో ముగిసింది. నేత్రావతి నది వద్ద అదృశ్యమైన ఆయన అక్క డే విగతజీవిగా కనిపించారు. సోమ వారం రాత్రి మంగళూరు సమీపంలో ఉళ్లాల వద్ద నేత్రావతి నది వంతెనపై కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం బుధవారం ఉదయం సమీపంలోని నదీ జలాల్లో లభ్యమైంది. పోస్ట్‌మార్టం తదితరాలను మంగళూరులో నిర్వహించి చిక్కమగళూరులో స్వస్థలంలో దహన సంస్కారాలు జరిపారు. వేలాదిగా తరలివచ్చిన రాజకీయ సినీ ప్రముఖులు, కెఫే కాఫీడే సిబ్బంది, చిక్కమగళూరు వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. సీఎం యడియూరప్పతో పాటు మాజీ సీఎం కుమారస్వామి, మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

కుటుంబం కన్నీటి సంద్రం
మృతదేహం కనిపించిందనే విష యం తెలిసిన తర్వాత బెంగళూరు సదాశివనగర్‌లోని ఆయన మామ, మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ నివాసంలో కుటుంబ సభ్యుల్లో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో విషాద వాతా వరణం తాండవించింది. హెఏఎల్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కుటుంబ సభ్యులు చిక్కమగళూరుకు చేరుకున్నారు. అక్కడ సిద్ధార్థ్‌ పార్థివ దేహాన్ని చూసిన ఎస్‌ఎం కృష్ణ కుటుంబ సభ్యులు విలపించారు. ఎస్‌ఎం కృష్ణ సతీమణి ప్రేమ, సిద్ధార్థ్‌ సతీమణి మాళవిక, తల్లి వాసంతి, పిల్లలు అమర్థ్య, ఇషాన్‌లను ఓదార్చడం అక్కడ ఎవరివల్ల కాలేదు.

ఎస్టేట్‌లో అంత్యక్రియలు  
భౌతికకాయాన్ని బెంగళూరుకు తరలించాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యుల సూచన మేరకు సొంతూరు చిక్కమగళూరు జిల్లా చేతనహళ్లికి తీసుకెళ్లారు. చిక్కమగళూరు నగరంలోని ఏబీసీ కాఫీ ఫ్యాక్టరీలో చివరిసారిగా వేలాదిమంది సిద్ధార్థ్‌ భౌతికకాయాన్ని సందర్శించారు. చేతనహళ్లి ఎస్టేట్‌కు తరలించి సాయంత్రం 6.55 నిమిషాలకు చితికి నిప్పంటించారు. సిద్ధార్థ్‌ అనుమానస్పద మరణంపై మంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు