నో గందరగోళం ఈవీఎంపై అభ్యర్థి చిత్రం

24 Jan, 2018 08:27 IST|Sakshi

వచ్చే ఎన్నికల్లోనే అమలు

ఈసీ వినూత్న నిర్ణయం

రానున్న విధానసభ ఎన్నికల్లో ఓటింగ్‌ విషయంలో భారీ సంస్కరణే జరిగేలా ఉంది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, పార్టీ చిహ్నంతో పాటు వారి ఫోటోను కూడా ముద్రించాలని ఈసీ నిర్ణయించింది. దీని వల్ల పలు రకాల తర్జనభర్జనలకు పుల్‌స్టాప్‌ పడనుంది.  

సాక్షి, బెంగళూరు: ఎన్నికల్లో ఓటర్లను గందరగోళ పరిచి ఎలాగైనా ఓట్లను రాబట్టేందుకు కొన్ని పార్టీలు పన్నాగాలు వేస్తుంటాయి. తమ ప్రత్యర్థిని బోల్తా కొట్టించాలని అదే పేరుతో ఉన్న మరికొందరు అనామకులను పోటీకి నిలుపుతుంటాయి. ఆ విధంగా ఓటర్లను గందరగోళానికి గురిచేసి ప్రత్యర్థికి రావాల్సిన ఓట్లను తమ ఖాతాలోకి వచ్చేలా చేస్తుంటాయి. ఇలాంటి చెత్త వ్యూహాలకు చెక్‌ చెప్పేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఒక వినూత్న ఆలోచన చేసింది. త్వరలో జరిగే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తులతో పాటు వారి ఫొటోలు కూడా ముద్రించేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ప్రయోగాన్ని అమలు చేయనుంది. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. తద్వారా ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్థికే ఓటు వేసేలా వెసులుబాటు కల్పించనుంది.

వరుస క్రమంలో ఇలా...
ప్రతి ఈవీఎంపై పేరుతో పాటు బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో, సంబంధిత పార్టీ గుర్తు ఉంటుంది. ఈవీఎంపై ఫొటో 2.5 సెంటీ మీటర్ల పరిమాణంలో అభ్యర్థుల పేర్ల పక్కనే ఫోటోలను ముద్రిస్తారు. అభ్యర్థుల పేర్లను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. అక్షరాల వరుస ఆధారంగా తొలుత జాతీయపార్టీ అభ్యర్థుల పేర్లు అనంతరం ప్రాంతీయ పార్టీ అభ్యర్థుల పేర్లు, ఆపై మిగిలిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, వారి ఫొటోలను ముద్రిస్తారు.

అన్నిచోట్లా వీవీ ప్యాట్‌లు
ఇకపై ఓటర్‌ ఎవరికి ఓటు వేశాడో నిర్ధారించుకునే వెసులుబాటు కూడా రానుంది. ఓటు వేసిన తర్వాత ఈవీఎంతో అనుసంధానం చేసిన వీవీ ప్యాట్‌ (ఓటర్‌ వెరిఫియబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) నుంచి ఒక రసీదు వంటిది వచ్చి కొన్ని క్షణాల పాటు కనిపించి తరువాత మూసి ఉన్న డబ్బాలోకి వెళ్లిపోతుంది. దీంతో ఓటర్‌ తాను ఎవరికి ఓటు వేశాడో నిర్ధారించుకోవచ్చు. పోలింగ్‌ అనంతరం నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను వీవీపీఏటీ ప్రింటవుట్‌ల ద్వారా ప్రింట్‌ అయిన పేపర్లతో లెక్క సరిచూసుకోవచ్చు.

ఓటర్ల కోసమే ఫోటోలు
ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలను ఉపయోగించాం. త్వరలో జరిగే రాజస్థాన్‌ ఉపఎన్నికల్లోనూ ఈ ఫొటోల విధానం అమలు చేస్తాం. వీటివల్ల ఒకే పేరుతో ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండదు. – సంజీవ్‌ కుమార్, కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు