అభ్యర్థులు కావలెను

28 Sep, 2016 02:16 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్‌తో రాజకీయ పార్టీలకు ముప్పు వచ్చిపడింది. ఎన్నికలను ఢీకొనగల సరైన మహిళా అభ్యర్థుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే మినహా మిగిలిన అన్ని పార్టీలూ ‘అభ్యర్థులు కావలెను’ అని బోర్డు పెట్టుకునే పరిస్థితుల్లో పడిపోయాయి. తమిళనాడులో వచ్చే నెల 17, 19 తేదీల్లో రెండు దశల్లో స్థానిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు.

రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెరగడం హర్షణీయమైనా పురుషుల శాతానికి సమానంగా స్త్రీలు ప్రజాబాహుళ్యంలోకి అడుగుపెట్టక పోవడం అభ్యర్థుల ఎంపికలో అనేక రాజకీయ పార్టీలను ఇరుకున పడవేసింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లోనూ మహిళా నేతలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీంతో 50 శాతం రిజర్వేషన్‌కు అనుగుణంగా మహిళా అభ్యర్థుల ఎంపికలో ఆ రెండు పార్టీలకు కొత్తగా వచ్చిన సమస్య లేదు. ఎన్నికల తేదీని అకస్మాత్తుగా ప్రకటించినా మహిళా కార్యకర్తలు సంవృద్ధిగా ఉన్న ఆ రెండు పార్టీలూ కంగారుపడలేదు. ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఈనెల 26వ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.

డీఎంకే సైతం ఈనెల 28వ తేదీన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. నామినేషన్ల గడువు వచ్చేనెల 3వ తేదీతో ముగిసిపోతుండగా, ఎన్నికల పోలింగ్‌కు కేవలం 15 రోజులే ఉన్న తరుణంలో అభ్యర్థులు వెంటనే నామినేషన్ వేసి జోరుగా ప్రచారంలోకి దిగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీలు ఇంకా అభ్యర్థులు దొరక్క కిందమీదా పడుతున్నాయి. అన్నాడీఎంకే ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నా రెండాకుల చిహ్నంపైనే పోటీ చేయాలన్న నిబంధనతో ఏ పార్టీకూడా ముందుకు రాలేదు. డీఎంకే, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా రంగంలోకి దిగుతుండగా, సీట్ల సర్దుబాటులో చర్చలు సా గుతున్నాయి. ముస్లింలీగ్ సైతం డీఎంకే వెంటనే తమ పార్టీని ప్రకటించుకున్నందున అభ్యర్థుల సమస్య తలెత్తలేదు.

 తమిళ మానిల కాంగ్రెస్ ఒంట రిపోరుకు సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు కొన్నిపార్టీలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే జాతీయ పార్టీ బీజేపీ సైతం తగిన మహిళా అభ్యర్థులు దొరక్క అవస్థలు పడుతున్నట్లు సమాచారం. అలాగే డీఎండీకే, ఎండీఎంకే, తమాకా, పీఎంకే, వీసీకే తదితర తృతీయ శ్రేణీ పార్టీలన్నీ మహిళా అభ్యర్థుల కోసం దుర్భిణిని పెట్టి వెతుకుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చేతిలో మట్టి కరిచిన ఈ పార్టీలన్నీ స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు దీటైన పోటీని ఇచ్చేవారు ఆయా పార్టీల్లో కరువయ్యారు.

 పీఎంకే, డీఎండీకేల్లోనైతే పురుష అభ్యర్థులు కూడా దొరకలేదని తెలుస్తోంది. డీఎండీకే, పీఎంకే, వీసీకే పార్టీలు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేకమందిపై వత్తిడి తెచ్చి మరీ పోటీకి దించారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థులంతా దారుణంగా ఓటమి పాలై ఆర్థికంగా చితికి పోయారు. ఇలా అనేక పార్టీలు 60 వేల అభ్యర్థుల కోసం అయోమయంలో పడిపోయాయి.                      

మరిన్ని వార్తలు