అమ్మపై అసంతృప్తి

28 Sep, 2016 02:07 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక ఎన్నికల్లో పోటీకి అన్నాడీఎంకే అవకాశం ఇవ్వలేదంటూ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. అమ్మ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం ఆందోళనకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత స్థానాల వల్ల అగ్రనేతలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ మొదలుకుని గ్రామ పంచాయతీ వరకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అవసరం కాబట్టి అన్నాడీఎంకేలోని ఔత్సాహికులంతా ఆశపడ్డారు.

 అమ్మ ప్రకటించే అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూశారు. ఈనెల 26వ తేదీన అన్నాడీఎంకే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో హతాశులయ్యారు. చెన్నై టీ నగర్ 132 వార్డుకు ప్రకటించిన అభ్యర్థిఆనంది మరో వార్డుకు చెందిన మహిళా అంటూ అగ్రహించిన కార్యకర్తలు అన్నాడీఎంకే దక్షిణ కార్యాలయాన్ని, రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుచ్చిరాపల్లి కార్పొరేషన్‌లోని పలువురు అన్నాడీఎంకే కౌన్సిలర్లపై ముందుగానే అసంతృప్తి నెలకొని ఉండగా, వారిలోని కొందరికి మళ్లీ అవకాశం రావడంతో ప్రత్యర్థులు భగ్గుమన్నారు.

ఈ విషయంపై తాడోపేడో తేల్చుకోవాలని సుమారు 500 మంది కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. మార్గమధ్యంలో మంత్రి వెల్లమండి నటరాజన్ కారులో ఎదురురావడంతో ముట్టడించారు. కారును రాళ్లతోనూ, చెప్పులతోనూ కొట్టారు. డబ్బులు పుచ్చుకుని సీటిచ్చారని, పార్టీ ద్రోహి అంటూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి కారు నుంచి దిగి చర్చలు జరిపారు. కోయంబత్తూరు, దిండుగల్లు జిల్లాల్లో సైతం పార్టీ కార్యాలయాల ముట్టడి చేశారు.

 ఆత్మహత్యా యత్నం: తిరువళ్లూరుకు చెందిన సిట్టింగ్ అభ్యర్థి సెల్వకుమారి పోటీ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. తనకు అవకాశం వస్తుందని ప్రజల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే జాబితాలో పేరు లేకపోవడంతో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చెన్నై చేపాక్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. తీవ్రగాయాలకు గురైన ఆమెను చెన్నై కీల్‌పాక్ ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే తిరువళ్లూరుకు చెందిన తమిళ్ సెల్వి టికెట్ ఆశించి భంగపడ్డారు.

తన భార్యకు అవకాశం రాలేదని ఆవేదన చెందిన భర్త రజనీరవి సోమవారం రాత్రి తన చేతిని కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తీవ్రరక్తస్రావం అవుతుండగా గుర్తించిన ఆయన భార్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.అలాగే చెన్నై విరుగంబాక్కం వార్డు కార్యదర్శి ఆర్ శేఖర్ తనకు అవకాశం రాలేదని తెలుసుకుని మంగళవారం తెల్లవారుజాము 5.45 గంటలకు 20 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 అన్నాడీఎంకే నామినేషన్లు:అన్నాడీఎంకే అభ్యర్థులు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లలోని 919 వార్డు స్థానాలకు, పంచాయతీల్లోని 638 స్థానాలకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అందరూ సరిగ్గా మధ్యాహ్నం 12.05 నుంచి ఒంటి గంటలోగా నామినేషన్లు వేయడం పూర్తి చేశారు. అలాగే చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డులకు మండల కార్యాలయాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులులు నామినేషన్లు వేశారు.

 బందోబస్తులో లక్ష పోలీసులు:స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతి భద్రతల నడుమ పూర్తయ్యేలా లక్ష మంది పోలీసులను బందోబస్తు పెడుతున్నట్లు డీజీపీ టీకే రాజేంద్రన్ మంగళవారం ప్రకటించారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో మొత్తం 7 వేల పోలింగ్ బూతులు ఉండగా వీటిల్లో 300 సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించి 12 వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టినట్లు తెలిపారు. అలాగే చెన్నై నగర పరిధిలో ముందు జాగ్రత్త చర్యగా 10వేల మంది రౌడీలపై నిఘా పెట్టామని చెప్పారు. తుపాకీ లెసైన్సు దారులు తమ ఆయుధాలను స్వచ్చందంగా అప్పగించాలని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు