నాన్నా అనకుండానే..

24 Feb, 2017 17:51 IST|Sakshi
నాన్నా అనకుండానే..

బెంగళూరు :
కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలైన మైసూరు లోకాయుక్త ఎస్పీ  రవికుమార్‌ (36) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బెంగళూరు నుంచి మైసూరుకు తిరిగివెళ్తూ ఆయన ప్రయాణిస్తున్న కారు రామోహళ్లి వద్ద బోల్తా పడడంతో దుర్మరణం పాలయ్యారు. గురువారం రవికుమార్‌ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. కడసారి చూసేందుకు బంధువులే కాకుండా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, జనం తరలివచ్చారు. సాసలు గ్రామంలో చిన్ననాటి స్నేహితులు రవిని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను సముదాయించడం ఎవరితరం కాలేదు.   

నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతస్థాయికి
మూడేళ్ల క్రితం రవికుమార్‌కు అనిత అనే యువతితో వివాహం జరుగగా 10 రోజుల క్రితమే వారికి ఆడపాప జన్మించింది. పురిటి బిడ్డ కన్నతండ్రిని కళ్లుతెరిచి చూసే లోపే శాశ్వతంగా తండ్రి దూరమవడం అందరినీ కంటతడి పెట్టించింది. రవికుమార్‌ తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన రవికుమార్‌ పట్టుదలతో చదివి పోలీసు అధికారిగా ఉద్యోగంలో చేరారు. స్వశక్తితో జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకుంటున్న తరుణంలో విధికి కన్నుకుట్టింది. ఆయనకు ఇద్దరు అన్నలు ఉండగా ఒకరు టీచరు, మరొకరు రైతు. భార్య అనిత గృహిణి. భర్త లేడనే చేదు నిజం నమ్మలేక ఆమె షాక్‌కు గురైంది. పాప పుట్టాక భర్త ఒక్కసారి చూసి వెళ్లారు. త్వరలోనే వస్తానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు విలపించారు.
   
తిరిగిచూడని మంత్రులు.. భగ్గుమన్న స్థానికులు  
మధ్యాహ్నం ఒంటిగంట అయినా ఒక్క మంత్రి కూడా రవికుమార్‌కు నివాళులర్పించడానికి రాకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహించారు. ఒక ఉన్నతాధికారి విధినిర్వహణలో మరణిస్తే కనీసం నివాళులర్పించలేరా? అని ప్రశ్నించారు. హోం మినిస్టర్‌ పరమేశ్వర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కృష్ణభైరేగౌడ తక్షణం రావాలని డిమాండు చేస్తూ గంటపాటు రవికుమార్‌ భౌతికకాయంతో ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణయ్య మాట్లాడుతూ మంత్రులు రాలేని పరిస్థితిలో ఉన్నారని వివరణ ఇచ్చి శాంతింపజేశారు. జిల్లా కలెక్టర్‌ పాలయ్య, ఏసీ జగదీష్, తహసీల్దార్‌ మోహన్, బెంగళూరు ఐజీ సీమంత్‌కుమార్‌సింగ్, మైసూరు ఐజీ నితిన్‌కుమార్, ఉన్నతాధికారులు రవికుమార్‌ను కడసారి దర్శించి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు