లాక్‌డౌన్‌ ఉల్లంఘన; ఎమ్మెల్యేపై కేసు నమోదు 

16 Jun, 2020 07:38 IST|Sakshi

లాక్‌డౌన్‌కు తూట్లు 

వేడుకగా పుత్రుని వివాహం

సాక్షి, బళ్లారి: కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ నియమాలను గాలికి వదిలి కుమారుడు పెళ్లి ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి, హడగలి ఎమ్మెల్యే పీటీ పరమేశ్వర్‌ నాయక్‌పై కేసు నమోదు చేశారు. సోమవారం హడగలి తాలూకా లక్ష్మీపురలో తన కుమారుడు అవినాశ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం చేరారు. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ పరమేశ్వర హెలికాప్టర్‌లో వివాహ వేడుకకు హాజరయ్యారు. హెలికాప్టర్‌ రాకను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి లాక్‌డౌన్‌ నియమాలను గాలికి వదిలి గుమిగూడారు.

దీంతో పాటు వివాహ వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీ.శ్రీరాములుతో పాటు పలువురు శాసససభ్యులు, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగా వేసుకోవాలని నిబంధనలు ఉన్నా పెళ్లిలో అలాంటి సన్నివేశాలు కనిపించకపోవడంతో పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. 50 మంది కన్నా ఎక్కువ మంది పెళ్లికి హాజరు కాకూడదని నిబంధనలు ఉండటంతో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చేసుకోమంటే.. నగ్న ఫోటోలతో బయపెడుతూ.. 

మరిన్ని వార్తలు