ఇక పశుభాగ్య

12 Oct, 2014 01:54 IST|Sakshi
ఇక పశుభాగ్య
  • ప్రోత్సాహంగా నగదు స్థానంలో పాడి పశువులు
  •  ఎస్సీ, ఎస్టీలకు నూతన సంక్షేమ పథకం
  •  వారిని పాడి వైపు ప్రోత్సహించడమే లక్ష్యం
  •  నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు
  • సాక్షి, బెంగళూరు :షెడ్యూలు కులాలు, తెగల వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రోత్సాహక ధనానికి బదులు పాడి పశువులను ఇచ్చే యోచనలో రాష్ర్ట సర్కార్ ఉంది. దీన్ని ‘పశుభాగ్య’ పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రానున్న కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం పాడి రైతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు 10 శాతం మంది కూడా లేరు. దీంతో ఆ వర్గానికి చెందిన వారిని పాడి వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందిస్తోంది.

    పాడి రైతులకు లీటరు పాలకు రూ.4, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.6 ప్రోత్సాహకంగా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన రూ.104 కోట్లను సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఖర్చు చేయాలనే విషయంపై మంత్రి మండలిసమావేశంలోనూ చర్చించారు. అయితే దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయ, పశుసంవర్థక శాఖ మంత్రి టీబీ జయచంద్రకు విభేదాలు చోటుచేసుకున్నాయి.

    ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ప్రోత్సాహకాన్ని పెంచడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీబీ జయచంద్ర వాదించారు. దీంతో ప్రోత్సాహకం పెంపు నిర్ణయం మూడు నెలలుగా వాయిదా పడుతోంది. సమస్య పరిష్కారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకం బదులు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉచితంగా లేదా దాదాపు 95 శాతం సబ్సిడీపై రెండు పాడి పశువులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇందుకు సంబంధించి అర్హుల ఎంపికను స్థానిక శాసన సభ్యులకు ఇవ్వాలని తీర్మానించింది. మరోవైపు పశువుల కొనుగోలు, నిధుల విడుదల విషయం సాంఘిక, సంక్షేమ, పశుసంవర్థకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. మొదటి ఏడాది 13,000 మందికి ‘పశుభాగ్య’  పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా వచ్చే నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
     

మరిన్ని వార్తలు