'ఆగ్నెస్ ఆఫ్ గాడ్'పై ఆగ్రహజ్వాలలు

5 Oct, 2015 17:53 IST|Sakshi
'ఆగ్నెస్ ఆఫ్ గాడ్'పై ఆగ్రహజ్వాలలు

- వివాదాస్పద నాటకంపై రాజుకుంటున్న వివాదం
- ప్రదర్శనను నిషేధించాలని మహారాష్ట్ర సర్కారుకు క్రైస్తవ సంఘాల వినతి


ముంబై:
వివాదాస్పద 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' నాటకంపై మరోసారి ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. సన్యాసినిగా మారిన ఓ యువతి అనూహ్య రీతిలో బిడ్డకు జన్మనిచ్చే కథాంశంతో రూపొందిన 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' నాటకం నేటి (సోమవారం) నుంచి ముంబైలో ప్రదర్శితం కానుంది. దీనిపై పలు క్రైస్తవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నాటక కథాంశం సన్యాసినులను అవమానపర్చేదిగా ఉందని, మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శనలు ఉద్రిక్తతలకు దారితీస్తాయని గగ్గోలుపెడుతున్నాయి.

నాటకం నిలిపివేతకు ఆదేశించాలంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసి వినతిపత్రం సమర్పించాయి. ఇదే విషయంపై మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే సోమవారం మీడియాతో మాట్లాడుతూ 'ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, సంబంధిత వ్యక్తులతో మాట్లాడిన తర్వాత నిర్ణయానికి వస్తామని చెప్పారు.

అమెరికాకు చెందిన జాన్ పెల్మెర్ అనే రచయిన 80వ దశకంలో మెదటిగా 'ఆగ్నెస్ ఆఫ్ గాడ్' నాటకం రాశారు. కొత్తగా సన్యాసం స్వీకరించిన యువతి అనుకోని పరిస్థితుల్లో గర్భం దాల్చుతుంది. ఆమె పాపానికి పరిహారమన్నట్లు మృత శిశువుకు జన్మనిస్తుంది. ఈ సంఘటన ఆమెతోపాటు సంబంధిత వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది మిగతా కథ. న్యూయార్క్ లో జరిగిన యధార్థ సంఘటన ఆధంరంగానే జాన్ ఈ నాటకాన్ని రాశారని ప్రచారంలో ఉంది. ఈ నాటకం ఆధారంగా అదే పేరుతో 1985 వచ్చిన హాలీవుడ్ చిత్రం అనేక అవార్డులను గెల్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఓ ప్రముఖ నాటకసంస్థ ఆగ్నెస్ ఆఫ్ గాడ్ నటకాన్ని ముంబైలో ప్రదర్శించనుంది.

మరిన్ని వార్తలు