‘డైరీ’లో గుట్టు

22 Aug, 2015 14:28 IST|Sakshi
‘డైరీ’లో గుట్టు

చెన్నై : టెలికాం మాజీ మంత్రి ఏ.రాజాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగయనుంది. ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు డైరీల్లో రాజా గుట్టు ఉన్నట్టు తేలడంతో, అందులోని నంబర్లను, వివరాలను సమగ్రంగా సీబీఐ పరిశీలిస్తున్నది.
 
 స్పెక్ట్రమ్ కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా ప్రమేయం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి  రాష్ట్రంలో డిఎంకే కష్టాలు ఆరంభం అయ్యాయి. ఈ సారి ఎలాగైనా అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉరకలు తీస్తున్న డిఎంకే అధినేత  కరుణానిధికి మాజీ టెలికాం మంత్రుల రూపంలో కొత్త చిక్కులు ఎదురు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.  ఓ వైపు బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల వ్యవహారంలో టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్ ప్రమేయం విచారణ వేగవంతం సాగుతున్న తరుణంలో అదే శాఖకు మంత్రిగా వ్యవహరించిన రాజాపై కొత్త కేసు నమోదు డీఎంకేకు శిరోభారంగా మారి ఉన్నది.
 
 డైరీలో గుట్టు: టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు రాజా ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టు సీబీఐ గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును రెండు రోజుల క్రితం నమోదు కూడా చేసింది. అదే సమయంలో రాజా ఇళ్లు, ఆయన బంధువులు, కుటుం బీకులు, మిత్రుల ఇళ్లు కార్యాలయాల్లో రెండు రోజులు గా తనిఖీలు కొనసాగుతూ వచ్చాయి. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల ఆస్తులకు సంబంధించిన రికార్డులు బయట పడ్డట్టు సమాచారం. అలాగే, రాజా లాకరులో 20 కేజీల వెండి, ఆరు కిలోల బంగారం బయట పడింది. ఇంత వరకు బాగానే ఉన్నా, అస్సలు గుట్టు అంతా రాజా డైరీలో దాగి ఉన్నట్టు తేలింది. రాజా ఇంట్లో జరిపిన సోదాల్లో ఐదు డైరీలు లభించినట్టు, ఇందులోనే అస్సలు కథ ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 నగదు బట్వాడా, వ్యవపార లావాదేవీలతో పాటుగా అనేక వివరాలు, కీలక ఫోన్ నంబర్లు అందులో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ డైరీని క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిర్ణయించినట్టు సీబీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అందులోని మొబైల్ , ల్యాండ్ లైన్ నంబర్లు, కొన్ని కోడ్‌లను పరిగణలోకి తీసుకుని పరిశీలన సాగుతున్నదని, అవసరం అయితే, రాజాను విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. రాజాతో సాగే విచారణ అనంతరం, ఆయన కుటుంబీకులు, మిత్రుల్ని సైతం విచారించి తదుపరి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ పరిణామాలన్నీ త్వరితగతిన సాగనున్న దృష్ట్యా, అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ కేసులో రాజ అండ్ బృందాన్ని పోలీసులు అరెస్టు చేసిన పక్షంలో డీఎంకేకు మరింత గడ్డుకాలమే.

మరిన్ని వార్తలు