పైసా ఇవ్వలేదు

16 Nov, 2014 03:00 IST|Sakshi

* అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రాష్ట్రం
* కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కృష్ణ బైరేగౌడ ఆవేదన

సాక్షి, బెంగళూరు/ రాయచూరు రూరల్ :  అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి వీలుగా ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయచూరులో స్థానిక మీడియాతో శనివారం ఆయన మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురిసిన అధిక వర్షాల వల్ల రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆర్థికంగా చాలా నష్టపోయారన్నారు.
 
ఇందు కోసం రూ.266 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నెల ముందే నివేదిక పంపినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 34 తాలూకాల్లో కరువు ఛాయలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం అందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.537 కోట్లు విడుదల చేసిందన్నారు.

మరిన్ని నిధుల విడుదలకు తమ ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ వర్శిటీ, కళాశాలల స్థాపనకు ఎక్కువ డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనన్నారు. అందుకు సరిపడా మానవ వనరులు లేకపోవడం వల్ల డిమాండుకు తగిన సంఖ్యలో విద్యా సంస్థలను స్థాపించలేక పోతున్నామని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హై కమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

మరిన్ని వార్తలు