ఎన్నికల వేళ 'అమ్మ'కు షాక్!

21 Apr, 2016 12:54 IST|Sakshi
ఎన్నికల వేళ 'అమ్మ'కు షాక్!
 • రాజీవ్ హంతకుల విడుదలకు కేంద్రం నో
 • సుప్రీంలో కేసు ఉందంటూ దాటవేత
 •  
  సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడులోని శ్రీపెరంబుదూరుకు చేరుకున్న సమయంలో ఎల్‌టీటీఈ మానవబాంబు చేతిలో దారుణహత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసు విచారణలో చివరకు ఏడుగురికి ఉరిశిక్ష పడగా రాష్ట్రపతి క్షమాభిక్షతో యావజ్జీవంగా మారింది. మురుగన్, పేరరివాళన్, శాంతన్, నళిని, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ బయాస్ ఈ ఏడుగురు గత 20 ఏళ్లుగా వేలూరు సెంట్రల్  జైలు జీవితం గడుపుతున్నారు. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు 14 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపిన పక్షంలో రాష్ట్రప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని విడుదల చేయవచ్చని చట్టం చెబుతోంది.
   
  రెండేళ్ల క్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం సైతం ఇదే విషయాన్ని ఆనాడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దీపావళి కానుకగా ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు 2014లో ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి అనుమతి కోసం కేంద్రానికి పంపారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మాజీ ప్రధాని హత్య కేసుకే ఈ గతా అంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అంతేగాక హంతకుల విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు.
   
  ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు చేపట్టిన విచారణలో శిక్షపడినందున వారిని విడుదల చేసే హక్కు రాష్ట్రప్రభుత్వానికి లేదని గత ఏడాది డిశంబరు 2 వ తేదీన తీర్పుచెప్పింది. దీంతో ఏడు మంది హంతకుల విడుదల అంశంపై అప్పటికి అటకెక్కేసింది. అయితే, 24 ఏళ్లుగా జైలులో ఉన్న ఏడు మంది అర్హులు కాబట్టి వెంటనే విడుదల చేయాల్సిందిగా రాష్ట్రంలోని అనేక ప్రజా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేయడంతోపాటు నిరసనలు వ్యక్తం చేశాయి.
   
  ఈ పరిణామంతో సీఎం జయలలిత ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ గత నెల 2వ తేదీన ఇటీవల కేంద్రహోంశాఖకు ఉత్తరం రాశారు. 24 ఏళ్లగా జైలులో ఉన్న ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ అంశంలో కే ంద్రం అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరారు.
   
  మేమేమీ చెప్పలేం
  తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర హోంశాఖ ఓ ఉత్తరం రాసింది. ఏడుగురు ఖైదీల విడుదల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించలేమని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం నుంచి అందిన ఉత్తరంపై న్యాయనిపుణులను సంప్రదించగా తమ నిర్ణయాన్నే సమర్థించినట్లు కేంద్రం తెలిపింది. ఏడుగురు ఖైదీలను విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని సైతం న్యాయనిపుణులు స్పష్టం చేశారని తెలిపింది.
   
  ఎన్నికల వేళ ఎదురుగాలి
  రాష్ట్రంలో దాదాపుగా ప్రతి అంశానికి రాజకీయాలు ముడిపడి ఉండగా, రాజీవ్ హంతకుల అంశానికి సైతం రాజకీయ రంగు పులుముకుంది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన దీపావళి రోజున ఏడు మంది హంతకులను విడుదల చేయడం ద్వారా మార్కులు కొట్టేయాలని సీఎం జయలలిత భావించారు. అయితే అనుకోని అవాంతరాలు వచ్చిపడటంతో నిరాశచెందారు. ఎన్నికల సమయంలో ఏడుమందిని విడుదల చేయడం ద్వారా సానుభూతిపరులను ఓట్లు రాబట్టుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం సహజంగానే ఆశించి ఉండవచ్చు. అందుకే సరిగ్గా ఎన్నికల ప్రకటన వెలువడే సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇదే సానుభూతిని పొందాలని ఎదురుచూస్తున్న బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు కోసం అర్రులుచాచి భంగపడింది. రెండుపార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభం కాక ముందే బెడిసికొట్టాయి. హంతకుల విడుదల అంశం తమ చేతుల్లో లేదని బీజేపీ ప్రభుత్వం తెలివిగా తప్పుకున్నట్లు భావించవచ్చు. తాజా పరిణామంతో సీఎం జయ, ఏడు మంది హంతకుల ఆశ నిరాశగా మిగిలిపోయింది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా