తెలంగాణ ఏర్పాటును ‘గాయం’గా భావించొద్దు

2 Jun, 2015 00:14 IST|Sakshi
తెలంగాణ ఏర్పాటును ‘గాయం’గా భావించొద్దు

ముందు ఆ భావనను తొలగించుకోండి
రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపు
ఇరు రాష్ట్రాల తెలుగు వారికి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
ఇక్కడి తెలుగు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా‘సాక్షి’తో ముఖాముఖి

సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును గాయంగా భావించవద్దని, ఒకవేళ ఆ భావన మనస్సుల్లో ఉంటే తొలగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ కోరారు.

పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, అన్నదమ్ముళ్లలా విడిపోయి కలసి ఉండొచ్చని చెప్పారు. ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ తొలి అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇరు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్రాలు విడిపోవడం మాయని గాయంగా మిగిలిపోతుందన్న అభిప్రాయాన్ని, భావాన్ని మనస్సుల్లోంచి తొలగించుకోండి. రెండు రాష్ట్రాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమాభిమానాలను, నమ్మకాన్ని పెంచాలి. హైదరాబాద్, ముంబైలాంటి నగరాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రజల సమాహారంవంటివి. ఈ బంధాన్ని ఎప్పటికీ తెంపవద్దు. గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికే చక్కటి సంకేతాన్ని అందించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలపై ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగినా మహారాష్ట్రలో మాత్రం తెలుగు వారంతా కలసిమెలసి ఉంటున్నారు’ అని సందేశాన్నిచ్చారు.
 
తెలుగు భవనం కోసం...
రాష్ట్రంలో తెలుగు భవనం ఏర్పాటుకు, కులధ్రువీకరణ పత్రాల జారీలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని విద్యాసాగర్ రావు తెలిపారు. ‘ రాష్ట్రంలోని శ్రమ శక్తి అంటే తెలుగువారే. అయితే అనేక మంది సమస్యలు బాధాకరం. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా నేత కార్మికులు, కూలీలు, శ్రామికులు, తదితరులపై మారిన పరిస్థితుల ప్రభావం పడింది. కొన్ని ప్రాంతా ల్లో వలస వచ్చిన ప్రజలే మళ్లీ వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో షోలాపూర్, భివండీ తదితర ప్రాంతాల్లో తెలుగువారి జనాభా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చాం. వాటిని అంచెలంచెలుగా పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సన్నద్ధవుతుంది అని ఆయన అన్నారు.
 
చెరగిపోని చరిత్ర...
ముంబైతోపాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో తెలుగు వారి చరిత్ర ఎన్నటికీ చెరిగిపోనిదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇక్కడి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం చెమటోడ్చిన చరిత్ర తెలుగువారిదని అభివర్ణించారు. సం యుక్త మహారాష్ట్ర కోసం   తెలుగు ప్రజలు చేసి న సుధీర్గమైన పోరాటం మరచిపోలేదని అన్నా రు. మహారాష్ట్ర కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుల్లో మనవారు కూడా ఉన్నారన్నారు.
 
ఉద్యమ సమిధలను స్మరించుకోవాలి...
తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన వారందిరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డల త్యాగం మరచిపోలేనిదని, ఆత్మగౌరవం కోసం గళం విప్పిన కళాకారులు, కదం తొక్కిన కలం యోధులకు అభినందినలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.
 
కరీంనగర్‌లో సంత్ గాడ్గేబాబా విగ్రహం
స్వచ్ఛత అభియాన్ గురించి సంత్ గాడ్గేబాబా చేసిన కృషి మరవలేనిదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఆయన విగ్రహాన్ని త్వరలోనే తెలంగాణలోని కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రజకుడైన ఆయన చేపట్టిన ఉద్య మం ద్వారా లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందిందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ వంటి వారిని కూడా ప్రభావితం చేశారన్నారు.

మరిన్ని వార్తలు