దావోస్‌నే రాష్ట్రానికి తీసుకొస్తా..

29 Jan, 2017 01:22 IST|Sakshi
దావోస్‌నే రాష్ట్రానికి తీసుకొస్తా..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
దేశంలో నన్ను మించిన సీనియర్‌ నాయకుడు ఎవరూ లేరు
♦ ప్రధాని నుంచి రాష్ట్రపతి దాకా.. అందరినీ నేనే ఎంపిక చేసేవాడిని
♦ మీడియాపై రుసరుసలు..


విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దావోస్‌నే ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తానని, ఇకపై అక్కడికి ఎవరూ వెళ్లరని ముఖ్యమంత్రి చంద్రబాబు  చెప్పారు. ప్రపంచం మొత్తాన్ని అనుసంధానం చేస్తానని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు రావని, అలా వచ్చిన రాష్ట్రాలుంటే చూపించాలన్నారు. ఆయన శనివారం విశాఖలో విలేకరులతో మాట్లా్లడారు. పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో 22,34,096 మందికి ఉపాధి  లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే పారిశ్రామిక సదస్సులో కేంద్ర ప్రభుత్వాన్నీ భాగస్వామిగా చేస్తామన్నారు.  

అది పొరపాటుగా అచ్చయింది
గతేడాది పారిశ్రామిక పెట్టుబడులపై ఇటీవల గవర్నర్‌ చేసిన ప్రసంగంలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు పేర్కొనడం సరికాదని, అది పొరపాటుగా అచ్చయిందని బాబు చెప్పారు. పెట్టుబడుల మొత్తాన్ని ఒక్కో చోట ఒక్కోలా ప్రకటించడాన్ని విలేకరులు ప్రశ్నించగా ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. ‘‘కలెక్టర్ల సమావేశంలో రూ.5 వేల కోట్లు అని మీరే చెప్పారు?’’ అని గుర్తుచేయగా... ‘‘మీరు విన్నారా?’’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏపీ జెన్‌కో ఏర్పాటు చేసే 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు గతంలోనే టెండర్లు పిలిచారని, మళ్లీ ఎంవోయూ ఏమిటన్న ప్రశ్నకు సమాధాన మిస్తూ.. ‘‘అది తప్పుడు ఎం వోయూనా? చూస్తాను’’ అని అన్నారు.

మీకు రహస్య ఎజెండా ఉంది
ఒక మీడియా ప్రతినిధి సందేహం అడిగేందుకు ప్రయత్నించగా సీఎం అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీది ఫలానా మీడియా కదూ... అయితే మీరు మాట్లాడకండి. మీవాళ్లు ఏ పరిశ్రమ తెచ్చినా అడ్డుపడతారు. మీకు హిడెన్‌(రహస్య) ఎజెండా ఉంది. మీరు కూర్చోండి’ అంటూ సీఎం ఆ విలేకరి చేతిలోని మైక్‌ తీసుకోండని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. మీడియాను పరిశీలిస్తున్నా అంటూ హెచ్చరికగా మాట్లాడారు.  

అప్పట్లో నేను చెప్పినట్లే జరిగేవి
అప్పట్లో తన ఎంపీల బలంతోనే వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడటంతో అన్నీ తాను చెప్పినట్లు జరిగేవన్నారు. దేశంలో తనను మించిన సీనియర్‌ నాయకుడు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ తానే ఎంపిక చేసేవాడినని చెప్పుకొచ్చారు.  నేపాల్‌ నుంచి వచ్చిన మంత్రిని శుక్రవారం సమాచారం లోపం వల్ల కలవలేకపోయానని, అప్పటికప్పుడు మంత్రులను పంపి అపాయింట్‌మెంట్‌ ఇచ్చానన్నారు. ఆయన కేవలం తనను కలవడానికే వైజాగ్‌ వచ్చానని చెప్పడం ఆనందాన్నిచ్చిందన్నారు. నన్ను కలవలేకపోతున్నందుకు బాధపడుతూ వెళ్లిపోదాం అనుకున్నట్లు చెప్పారన్నారు. బయటి వాళ్లు నన్ను కలవలేకపోయామని బాధపడుతున్నారంటే విదేశాల్లో నాకు ఎంత బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందో అర్థం చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) అనేది చాలా చిన్న సంస్థ అని, దాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదని , కానీ దానిని తానే ప్రమోట్‌ చేశానన్నారు.

పెట్టుబడులు రెట్టింపు: సీఎం
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: గతేడాదితో పోలిస్తే రెట్టింపు పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రూ.10.54 లక్షల కోట్ల విలువైన 665 పెట్టుబడులు వచ్చాయని, వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువ పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది 328 ఒప్పందాల ద్వారా రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు గుర్తు చేశారు. రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీని త్వరగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.

పెట్టుబడులకు ఏపీ సేఫ్‌ : గవర్నర్‌
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన రాష్ట్రం లేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్‌ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో వైద్యం, విద్య లభించే విధంగా దృష్టి సారించాలన్నారు. అందరికీ రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులుంటే  ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం 25 గంటలు, ఎనిమిది రోజులుంటాయని చెప్పారు. కాబట్టి మంత్రులు, అధికారులు మరింత కష్టపడాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు