'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'

24 Aug, 2016 14:38 IST|Sakshi
'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్యోగుల విభజన సమస్యను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వారి సమస్యను పట్టించుకునే తీరికే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలు నిర్వహించిన తీరుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ అపవిత్రం చేశారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్కరాలు జరిగినన్ని రోజులు ప్రజలను చంద్రబాబు పట్టి పీడించారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. 12 రోజులపాటు పుష్కరాలు జరిగాయని, కృష్ణా పరివాహక ప్రాంతం అంతటా పుష్కరాలు జరిగితే ఒక్క విజయవాడలోనే పుష్కరాలు జరిగినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే పుష్కరాలు జరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

పుష్కరాలకు 18వందల కోట్లు కేటాయించి నామినేషన్ పద్దతిలో సొంత పార్టీ వారికే పనులు కేటాయించి సగానికిపైగా నిధులు స్వాహా అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల డబ్బుతో పార్టీ ప్రచారం చేసుకున్నారని ఏ ఘాట్ కు వెళ్లినా పచ్చరంగు వేశారని, ఇంత నీచానికి దిగజారుతారా అని అంబటి మండిపడ్డారు. పుష్కరాలకు ముందు శతాబ్దాలు, దశాబ్దాలుగా ఉన్న ఉన్న పవిత్ర దేవాలయాలను ధ్వంసం చేసి మున్సిపాలిటి చెత్తలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా నది గర్భాన్ని చీల్చి ఇసుక మాఫియా సృష్టించింది కూడా చంద్రబాబే అని అన్నారు. కృష్ణా నదిని సర్వనాశనం చేసి పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగాయని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. నిజంగా హైందవ సాంప్రదాయంపై నమ్మకం ఉంటే ఉత్తరీయం వేసుకొని మూడుసార్లు మునిగి పుష్కర స్నానం చేస్తారని, చంద్రబాబు మాత్రం ఏం చక్కా ప్యాంటు, షర్ట్ తో స్నానం చేశారని, ఆయనకు నచ్చితే షూ వేసుకొనే స్నానం చేస్తారు కూడా అని ఎద్దేవా చేశారు.

పవిత్ర పుష్కరాలకోసం ప్రజలు వస్తే వారిని వెళ్లనీయకుండా గేట్లు వేసి చంద్రబాబు అనవసర ప్రసంగాలు చేసి వారిని పీడించారని, గేట్లు వేసి మరి  ఉపన్యాసం చేశారని అంబటి మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చినవారికి ఎవరైనా జీడీపీ రేటు 15శాతం పెంచాలని ప్రమాణం చేయిస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పుష్కరాలు జరిపించకూడదని, పుష్కర ఏర్పాట్లు చూసుకోవాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు