జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే: మద్రాసు హైకోర్టు

30 May, 2020 07:55 IST|Sakshi

దీప, దీపక్‌కు పూర్తి హక్కులు 

జయలలిత ఆస్తుల కేసు తీర్పులో మార్పులు 

మలుపులు తిరుగుతున్న ఆస్తుల వ్యవహారం

సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తులకు దీప, దీపక్‌ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లుగా ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు..? అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్‌సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవి తం గడుపుతోంది.

జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్‌ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్‌ కుమార్తె దీప, కుమారుడు దీపక్‌ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పారీ్టకి, ప్రాపరీ్టకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్‌ గార్డెన్‌లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. చదవండి: పోయెస్ ‌గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే

జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్‌ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్‌గార్డెన్‌ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్‌ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్‌ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. 

ఇతర ఆస్తుల మాటెలా ఉన్నా చెన్నై పోయస్‌గార్డెన్‌పై అటు ప్రభుత్వం ఇటు దీప, దీపక్‌ పట్టుబటి ఉన్నారు. పోయస్‌గార్డెన్‌ ఇంటిని స్మారక మందిరం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానమే చెప్పిందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తీర్పు వెలువడగానే మీడియా ముందు ధీమా వెలిబుచ్చారు. తాజా తీర్పుతో పోయస్‌గార్డెన్‌ ఇంటిపై దీప, దీపక్‌కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. చదవండి: వారిద్దరూ అమ్మ వారసులే

ఈ తీర్పును ఊహించలేదు: దీప 
మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్‌గార్డెన్‌ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్‌గార్డెన్‌ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్తానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలి.    చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? 

జయ ఆస్తుల చిట్టా 
జయలలిత ఆస్తులను అధికారికంగా లెక్కకట్టేందుకు ఉన్న ఆధారాలు ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో ఆమె చూపిన వివరాలు మాత్రమే. తన వార్షిక ఆదాయం రూ.9.34 కోట్లని 1996లో ఆదాయపు పన్నుశాఖకు లెక్కచూపారు. అధికశాతం వ్యవసాయంపై వచ్చే ఆదాయమని పేర్కొన్నారు. నెలకు ఒక్కరూపాయి జీతం పొందుతున్నట్లు ఆ లెక్కల్లో తెలిపారు. 2011 ఎన్నికల్లో పోటీచేసినపుడు రూ.51.4 కోట్ల ఆస్తి చూపారు. 2016లో రూ.113.73 కోట్ల ఆస్తిని నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. చరాస్థి కింది రూ.42 కోట్ల విలువైన బంగారు నగలను చూపారు. స్థలాలు, నిర్మాణాల కింద మరో రూ.72 కోట్ల ఆస్తులను ఆమె చూపారు. బ్యాంకుల్లో రూ.10.63 కోట్ల డిపాజిట్టు చూపగా ఇందులో రెండుకోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీజ్‌కు గురయ్యాయి. వివిధ కంపెనీల్లో రూ.27.44 కోట్లు పెట్టుబడులున్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21289.30 గ్రాముల బంగారం, 1250 కిలోల వెండిని సీజ్‌ చేశారు. రూ.2.4 కోట్ల అప్పుకూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 1992లో కొడనాడులో 900 ఎకరాల టీ ఎస్టేట్‌ను కొనుగోలు చేసి క్రమేణా 1,800 ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ఎకరా రూ.1 కోటికి పలుకుతుంది. ఇక లగ్జరీ వసతులతో కొడనాడు బంగ్లా కూడా ఉంది. కొడనాడు ఎస్టేట్‌ తనకు సొంతమని శశికళ చెబుతున్నారు. జయలలిత పేరున మొత్తం 173 ఆస్తులున్నట్లు సమాచారం. వీటిల్లో కనీసం వంద ఆస్తుల్లోనైనా జయలలితకు పెద్దవాటా ఉండే అవకాశం ఉంది. జయ ఆస్తులపై న్యాయస్థానంలో వాదోపవాదాల్లో రూ.913 కోట్ల ఆస్తులుగా చూపారు.  

మరిన్ని వార్తలు