‘పంచె’ కట్టుకు పరాభవం

13 Jul, 2014 00:08 IST|Sakshi
‘పంచె’ కట్టుకు పరాభవం

సాక్షి, చెన్నై: తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణ ‘పంచె’ కట్టుకు పరాభవం ఎదురైంది. పంచెకట్టుతో వచ్చిన న్యాయమూర్తి, న్యాయవాదులను లోనికి అనుమతించకుండా చెన్నై క్రికెట్ క్లబ్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. పీఎంకే నేత రాందాసు  ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. పంచె కట్టు తమిళ సంప్రదాయానికి ప్రతీక. ఈ సంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఁపంచెరూ. దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారంలో ఓ రోజు కొన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పంచె కట్టుతో విధులకు హాజరయ్యే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాల నాయకులు పంచె కట్టులోనే దర్శనం ఇస్తుంటారు. యూపీఏ -2 అధికారంలోకి వచ్చిన సమయంలో తమిళ సంప్రదాయానికి వన్నె చేకూర్చే విధంగా డీఎంకే ఎంపీలు పంచెకట్టుతో ఢిల్లీ వేదికగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం ఉంది. పపంచ అత్యున్నత న్యాయ స్థానం ఐక్యరాజ్య సమితిలో పీఎంకే  అధ్యక్షుడు జికే మణి పంచెకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
 విదేశాల నుంచి వచ్చేవారు తమిళ సంప్రదాయం మీద మక్కువ చూపుతున్న తరుణంలో ఆధునిక నాగరికత చెన్నైలో విశ్వరూపం దాల్చుతున్నట్టుగా కొన్ని సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. డ్రెస్ కోడ్ : చెన్నైలోని అనేక స్టార్ హోటళ్లు, క్లబ్‌లు డ్రెస్ కోడ్ అమలుచేస్తున్నాయి. ప్యాంట్, టీ షర్టు, సూటు కోటుల్ని తప్పని సరి చేశాయి. తమ హోటల్‌కు తగ్గట్టుగా డ్రెస్ కోడ్‌తో వచ్చే వారిని మాత్రమే లోనికి అనుమతించే పనిలో పడ్డాయి. తమిళ సంస్కృతి పరిరక్షణా నినాదంతో ప్రభుత్వం, తమిళాభిమానులు ముందుకు సాగుతున్న సమయంలో పాశ్చాత్య సంస్కృతిని హోటళ్లు, క్లబ్‌లు తెర మీదకు తెస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ డ్రెస్ కోడ్ కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసినా, వెలుగులోకి మాత్రం రావడం లేదు. అయితే, తాజాగా పంచె కట్టుకు పరాభవం ఎదురు కావడంతో తమిళాభిమానుల్లో ఆగ్రహం రేగుతోంది.
 
 పరాభావం :  చెన్నై చేపాక్కం స్టేడియం సమీపంలో తమిళనాడు క్రికెట్ క్లబ్ ఉంది. ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటు చేసిన ఈ క్లబ్‌లో నేటికీ, బ్రిటీషు వారి పెత్తనం సాగుతోంది. ఆంగ్లేయులు పెట్టిన ఆంక్షలు ఇక్కడ అమల్లో ఉండడం ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఈ క్లబ్‌లో ఓ ప్రైవేటు పుస్తకావిష్కరణ  కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు హైకోర్టు న్యాయమూర్తి హరి పరందామన్, సీనియర్ న్యాయవాదులు గాంధీ, స్వామినాథన్‌లకు ఆహ్వానం అందింది. వీరంతా వేర్వేరుగా శుక్రవారం సాయంత్రం ఆ క్లబ్ వద్దకు చేరుకున్నారు. అయితే, అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. పంచె కట్టుతో వచ్చినవారిని లోనికి అనుమతించే ప్రసక్తే లేదని క్లబ్ నిర్వాకులు, సిబ్బంది స్పష్టం చేశారు. తాము న్యాయమూర్తులమని, సీనియర్ న్యాయవాదులమని చెప్పుకున్నా, పంచె కట్టు అడ్డు రావడంతో వెను దిరగాల్సి వచ్చింది. తనకు, పంచెకట్టు సంస్కృతికి ఎదురైన పరాభావాన్ని న్యాయమూర్తి హరి పరందామన్ ఓ మీడియాతో పంచుకున్నారు.
 
 వివాదంలో క్రికెట్ క్లబ్ : పంచెకట్టును అడ్డుకున్న చెన్నై క్రికెట్ క్లబ్ వివాదంలోకి ఎక్కింది. ఈ క్లబ్‌లోని ఆంక్షలపై న్యాయమూర్తి హరి పరందామన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంగ్లేయులు వదలి పెట్టి వెళ్లిన ఆంక్షల్ని ఇక్కడ అమలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇక, పీఎంకే నేత రాందాసు, పీఎంకే అధ్యక్షుడు జికేమణి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆ క్లబ్ నిర్వాకాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను కించ పరిచే విధంగా వ్యవహరిస్తున్న క్లబ్‌లు, స్టార్ హోటళ్లపై చర్యకు ప్రభుత్వం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు అందరూ పంచె కట్టుతో కనిపిస్తుంటారని గుర్తు చేస్తూ, ఈ వ్యవహారం మీద ప్రభుత్వ తక్షణం స్పందించాలని, లేని పక్షంలో తమిళ సంస్కృతి సంప్రదాయాల్ని  ఈ క్లబ్‌లు, హోటళ్లు సర్వనాశనం చేయడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు