-

మద్రాసు కాదు.. చెన్నై హైకోర్టు

26 Jul, 2015 03:05 IST|Sakshi

 సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టు పేరును చెన్నైగా మార్చేందుకు అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడబోతున్నది.  ఇందుకు తగ్గ కార్యచరణ సిద్ధమైనట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు.  మద్రాసు నగరం చెన్నై మహానగరంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇక్కడున్న అన్ని కార్యాలయాలు, వ్యవహారాల్లో  మద్రా సు అన్న పేరును పక్కన పెట్టి చెన్నైగా మార్చేశారు. అయితే, హైకోర్టును మాత్రం మద్రాసు హైకోర్టుగానే పిలుస్తూ వస్తున్నారు. ఇక్కడ మాత్రం బోర్డులు సైతం మద్రాసు హైకోర్టు  అని రాసి ఉంటుంది. ఈ పేరు మార్పుకు పలు మార్లు న్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అయినా, పేరు మాత్రం మార లేదు. ఈ పరిస్థితుల్లో మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా పేరు మార్చడానికి అన్ని కసరత్తులు పూర్తి కావడంతో, త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇదే విషయాన్ని శని వారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు.
 
 చెన్నై హైకోర్టు: నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన న్యాయ సదస్సుకు సదానంద గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా ఎప్పుడు మార్చనున్నారంటూ మీడియా ప్రశ్నించగా, అందుకు తగ్గ కసరత్తులు పూర్తి అయ్యాయని సమాధానం ఇచ్చారు. చెన్నై హైకోర్టుగా పేరు మారుస్తూ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నదని స్పష్టం చేసి ముందుకు కదిలారు. ముందు బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన సదానంద గౌడ మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ను స్తంభింప చేయడం ప్రజా స్వామ్య విరుద్దంగా వ్యాఖ్యానించారు.
 
  మానవతా ధృక్పథంతో లలిత్ మోడికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారేగాని, ఆమె ఏ తప్పూ చేయలేదన్నారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి , రాజస్థాన్ ముఖ్యమంత్రి ఏ తప్పు చేయ లేదన్నారు. అయితే, తమకు  ఏ సమస్య చేతికి చిక్కక పోవడంతో వీటిని ఆధారంగా చేసుకుని తమ మీద కాంగ్రెస్ బురద జల్లుతున్నదని మండి పడ్డారు.  భూ సేకరణ చట్టం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకొస్తున్నామేగానీ, ఇందు లో ఎలాంటి లొసుగులు లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. కర్ణాటకలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, గౌరవ హత్యలు పెరిగాయని పేర్కొంటూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు.
 

మరిన్ని వార్తలు