రాష్ట్రంలోనూ ఆప్ హవా

5 Jan, 2014 01:50 IST|Sakshi
చెన్నై, సాక్షి ప్రతినిధి : సామాన్యుడికి పట్టం కట్టడం ద్వారా దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలోనూ హవా కొనసాగిస్తోంది. సభ్యత్వ స్వీకరణకు ప్రజలు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. దేశాన్ని పాలించే అర్హత రాజకీయ పెద్దలకే కాదు సామాన్యుడికి సైతం ఉందని ఢిల్లీ ఎన్నికలతో ప్రజలు తేల్చి చెప్పేశారు. ఏడాది క్రితం ఏర్పడిన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి అతిపెద్ద జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. ఢిల్లీ ఫలితాల ప్రభావం దేశ ప్రజలందరిపైనా పడడంతో పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మురంగా సాగుతోంది. చెన్నై, సేలం, కన్యాకుమారి, రామేశ్వరం, తిరునల్వేలి, నాగర్‌కోయిల్ తదితర జిల్లాల్లో సభ్యత్వ నమోదు శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన కొత్తలో తమిళనాడులో 6,400 మంది సభ్వత్వం కలిగి ఉన్నారు.
 
 ప్రస్తుతం ఆ సంఖ్య 31 వేలకు చేరుకుంది. సభ్యత్వ రుసుముగా రూ.10లు చెల్లించి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కన్వీనర్ లెనిన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరేందుకు ద్రవిడ పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. తాము ప్రముఖ రాజకీయవేత్తల కోసం ఎదురుచూడడం లేదన్నారు. తమ పార్టీలో సామాన్యునికే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తమ పార్టీ సభ్యత్వం స్వీకరించిన వారంతా సామాన్యులేనని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆమ్ ఆద్మీ పెనుమార్పులు తీసుకురాగలదని ప్రజలు నమ్ముతున్నారనేందుకు పెరిగిన సభ్యుల సంఖ్యే నిదర్శనమని చెప్పారు. ఈ నెల లేదా వచ్చే నెలలో చెన్నైలో పార్టీ రాష్ట్ర మహానాడును నిర్వహించబోతున్నామని, ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలను ఆహ్వానించామని చెప్పారు.
 
మరిన్ని వార్తలు