చెన్నైలో ఐసిస్‌ సానుభూతిపరుడు అరెస్ట్‌

4 Jul, 2017 19:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై వాల్‌టాక్స్‌ రోడ్డుకు చెందిన హరూణ్‌ రషీద్‌ అనే ఐసిస్‌ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడిని మంగళవారం రాజస్థాన్‌ ఏటీఎస్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఉగ్రవాద ఐసిస్‌ సంస్థకు ఆర్దిక సహకారంతో పాటు యువకులను రిక్రూట్‌ చేయడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. సెల్‌ఫోన్‌ అమ్మకాల పేరుతో రూ.5 లక్షల నిధులను నిందితుడు చేరవేసినట్లు సమాచారం. ఐసిస్‌కు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున నిధులు, యువకులను చేరవేయడం వంటి కార్యకలాపాలు సాగుతున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమాచారం అందింది.

ఈ సమాచారం మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. గత ఏడాది నవంబరులో రాజస్తాన్‌ పోలీసులు మహ్మద్‌ ఇక్బాల్‌, జమీల్‌ మహ్మమద్‌ అనే ఐసిస్‌ సభ్యులను అరెస్ట్‌ చేశారు. వీరి బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున నిధులు చేరుతున్నట్లు తేలింది. ఇందులో చెన్నై బర్మాబజార్‌లోని సెల్‌ఫోన్‌ దుకాణం కూడా ఉంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుకాణం నిర్వాహకుడు హరూణ్‌ రషీద్‌ సోమవారం రాత్రి అరెస్ట్‌ చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు