నేను అమాయకుడిని..

6 Jul, 2016 02:14 IST|Sakshi
నేను అమాయకుడిని..

* అబ్బే...స్వాతిని హత్య చేయలేదు
* నిందితుడిని కాపాడేందుకు యత్నాలని ఆరోపణ
* కోర్టులో రామ్‌కుమార్ బెయిల్ పిటిషన్

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో అరెస్టయిన నిందితుడు రామ్‌కుమార్ కేసును సరికొత్త మలుపు తిప్పాడు. స్వాతి హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటూ చెన్నై సెషన్స్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో గత నెల 24వ తేదీన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ యువకుడు దారుణంగా హతమార్చాడు.

హత్యకు వినియోగించిన కత్తిని పట్టాలపై విసిరివేసి ప్రయాణికులు చూస్తుండగానే పారిపోయాడు. రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ యువకుడు ఎంతో ఆందోళనగా పరుగెత్తడాన్ని గుర్తించారు. పుటేజీలోని ఫొటో సహాయంతో కేసు విచారణను ప్రారంభించిన పోలీసులు తిరునెల్వేలి జిల్లాలో రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగానే రామ్‌కుమార్ భయంతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

చికిత్స జరుగుతున్న సమయంలో పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం తీసుకోగా స్వాతి హత్యను అంగీకరించినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ టీ కే రాజేంద్రన్ స్వయంగా ప్రకటించారు. గొంతు కోసుకున్న గాయంపై చెన్నై రాయపేటలో చికిత్స పొందుతున్న రామ్‌కుమార్‌కు కోర్టు ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో రామ్‌కుమార్‌ను మంగళవారం పుళల్ జైలుకు తరలించారు.
 
నిందితుడిని నేను కాదు: రామ్‌కుమార్
స్వాతి హత్యకేసును ఛేదించడంలో పోలీసులకు ముచ్చమటలు పట్టించి ఎట్టకేలకూ నిందితుడు పట్టుబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై సెషన్స్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ ద్వారా ఇంతలోనే నిందితుడు రామ్‌కుమార్ కొత్త వాదనను లేవనెత్తాడు. స్వాతి హత్యకు నాకు సంబంధం ఏమిటీ, ఆ కేసులో నన్నెందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించాడు.

స్వాతి హత్యకేసుకూ తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఎవరో ఒక యువకుడు స్వాతిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి.  ఆ యువకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదని వాదించాడు. స్వాతిని హతమార్చిన నిందితుడిని కేసు నుంచి కాపాడేందుకు తనను ఇరికించారని అన్నాడు. తిరునెల్వేలిలో పోలీసులు తన ఇంటికి రాగానే తాను గొంతుకోసులేదని, ఆ గందరగోళంలో వేరే ఎవరో తన గొంతును కోశారని చెప్పాడు.

అయితే తానే గొంతుకోసుకున్నట్లు పోలీసులు కేసు పెట్టారని ఆరోపించాడు. తాను ఎంతో అమాయకుడిని, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనపై అక్రమంగా హత్యా కేసును బనాయించినందున బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నాడు నిందితుడి తరఫున కృష్ణమూర్తి అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు.

మరిన్ని వార్తలు